సినీ పరిశ్రమలో సక్సెస్ ఎప్పుడు వస్తుందో ఎవ్వరూ అంచనా వేయలేరు. సక్సెస్ కి కొలమానం అనేది ఉంటే.. అందరూ అదే చేస్తారు కదా. ఇది సాదా సీదా జనాలు అర్థం చేసుకుంటారు. కానీ టాలెంట్ ఉన్న వాళ్లకి వెంటనే అవకాశాలు రాకపోతే… వచ్చిన అవకాశాలు చేజారిపోతుంటే వాళ్ళు డిప్రెషన్ కి లోనవ్వడం ఖాయం. ఆ స్టేజికి వెళ్తే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) కూడా అలాంటి స్టేజీకే వెళ్లినట్టు నిన్న ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు. భీమ్స్ సాధారణంగా ఏ ఈవెంట్లో కూడా ఎక్కువగా మాట్లాడరు. సరదాగా ఒక పాట పాడేసి వెళ్ళిపోతారు. కానీ నిన్నటి ఈవెంట్లో మాత్రం అతను తన ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేకపోయారు.
వాస్తవానికి భీమ్స్ చాలా టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్. ‘వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్ లే’ ‘బాబు ఓ రాంబాబు’ ‘డియో డియో డిస్సక డిస్సక’ వంటి ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ ఇచ్చారు. కానీ అతనికి పెద్ద ఛాన్స్ ఇచ్చింది రవితేజ మాత్రమే. ‘బెంగాల్ టైగర్’ సినిమాకి సంగీత దర్శకుడిగా భీమ్స్ ను తీసుకున్నారు. ఆ సినిమాలో సాంగ్స్ అన్నీ బాగుంటాయి. టైటిల్ సాంగ్ అదిరిపోతుంది. సినిమా కూడా బాగా ఆడింది. కానీ భీమ్స్ కి దక్కాల్సిన అప్రిసియేషన్ దక్కలేదు.

బహుశా జియో లేని రోజుల్లో ఆ ఆల్బమ్ రావడం అనేది అతనికి కలిసిరాలేదేమో. అయితే ‘బెంగాల్ టైగర్’ తర్వాత భీమ్స్ కి సరైన ఛాన్సులు రాలేదు. చేసిన సినిమాలు హిట్ అవ్వకపోవడం అతనికి మైనస్ అయ్యింది. అతను నెక్స్ట్ లెవెల్ కి వెళ్లలేకపోతున్నాడు అనే డిజప్పాయింట్మెంట్ తో సూసైడ్ చేసుకోవడానికి రెడీ అయినట్టు స్పష్టమవుతుంది. అలాంటి టైంలో అతనికి ‘ధమాకా’ చేసే ఛాన్స్ ఇచ్చాడు రవితేజ. ఆ సినిమా పాటలన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.

భీమ్స్ ఆ సినిమాకి చాలా కసిగా పనిచేశాడు. ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకోవడం వల్లే.. అతనికి ‘మ్యాడ్’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘మ్యాడ్ స్క్వేర్’ ‘మాస్ జాతర’ ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ వంటి పెద్ద సినిమాలకు సంగీతం అందించే ఛాన్స్ దక్కించుకున్నట్టు స్పష్టమవుతుంది. సో ‘ధమాకా’ లేకపోతే భీమ్స్ ఇంత బిజీగా ఉండేవాడు కాదేమో. అందుకే తనకు రవితేజ పట్ల ఉన్న గ్రాటిట్యూడ్ ని నిన్న ‘మాస్ జాతర’ ఈవెంట్లో చూపించినట్టు అర్థం చేసుకోవచ్చు.
