సినిమా పరిశ్రమలో కొన్ని కొన్ని సార్లు ఊహించని ఫలితాలు ఎదురవుతుంటాయి.. ఎన్నో అంచనాలతో ఓ మూవీ తీసి రిలీజ్ చేస్తే.. రిజల్ట్ రివర్స్‌లో వచ్చిన సందర్భాలు.. అస్సలు అంచనాలు లేకుండా వచ్చి హంగామా చేసిన సంఘటనలు చాలానే జరిగాయి.. జరుగుతున్నాయి.. ఒక్కోసారి కథ బాగున్నా కానీ తీసే విధానంలో తేడా కొడుతుంది.. అలా అంచనాలతో వచ్చి.. ఫ్లాప్ అయిన ‘బాబాయ్ హోటల్’ గురించి తెలుసుకుందాం. విజయవాడలో ఫేమస్ అయిన ‘బాబాయ్ హోటల్’ పేరునే ఈ సినిమాకి పెట్టారు..
అప్పటికి కమెడియన్‌గా బీభత్సమైన బిజీగా ఉన్న ‘కామెడీ కింగ్’ బ్రహ్మానందం ప్రధాన పాత్రలో.. కిన్నెర కీలక పాత్రలో.. ‘హాస్యబ్రహ్మ’ జంధ్యాల దర్శకత్వంలో.. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ మీద స్టార్ ప్రొడ్యూసర్ కె.ఎస్. రామారావు నిర్మించారు. సుత్తివేలు, కోట, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శ్రీలక్ష్మీ, పావలా శ్యామల వంటి భారీ తారాగణంతో తీశారు..హోటల్ నడిపే రామ చంద్ర మూర్తి పేరుకి తగ్గట్టే అందరితో మంచిగా ఉంటూ.. అనాథ పిల్లలను చేరదీసి పెంచుతుంటాడు.. అందరిలానే తనకూ కొన్ని కష్టాలు ఉంటాయి..
వాటితో ఇబ్బందులు పడడం లాంటివి చూపించారు.. కథలో ప్రతీ క్యారెక్టర్‌కీ ఇంపార్టెన్స్ ఉంటుంది.. కామెడీతో పాటు కొన్ని సెంటిమెంట్ సీన్లు కూడా ఆకట్టుకుంటాయి.. కానీ ప్రేక్షకులను మెప్పించడంలో వెనుక పడింది.. కారణం ఏంటంటే.. ‘హాస్యబ్రహ్మ’ జంధ్యాల దర్శకత్వం.. ‘కామెడీ కింగ్’ బ్రహ్మానందం హీరో అనే సరికి ‘అహ నా పెళ్లంట’ రేంజ్‌లో ఊహించుకున్నారు.. ‘‘బాబాయ్ హోటల్’ అంటే బ్రహ్మానందం.. ఫలహారాలే తింటే పరమానందం’’..
అనుకున్నారు జనం.. ఆశించిన కామెడీ కంటే బరువైన ఎమోషన్లు ఎక్కువైపోవడంతో ఫ్లాప్ అయ్యింది.. వయసు మళ్లిన వ్యక్తిగా మొదలైన బాబాయ్ కథ, ఫ్లాష్ బ్యాక్ బాగుంటాయి కానీ.. క్లైమాక్స్ విషాదాంతంగా ముగియడం నచ్చలేదు చాలామందికి.. కామెడీతో పాటు సెంటిమెంట్ సీన్లలో కూడా అద్భుతంగా నటించారు బ్రహ్మానందం.. ఆయన కోసమైనా ‘బాబాయ్ హోటల్’ చూడొచ్చు అనే ప్రేక్షకులు కూడా ఉన్నారు.. సాయినాధ్ కథ ఇవ్వగా.. మాధవపెద్ది సంగీతానికి అన్ని పాటలూ వేటూరి రాయడం విశేషం..