సంగీత దర్శకుడు ఎస్.ఎస్.తమన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పుడంతా ఆయన హవానే నడుస్తోంది. ఏ పెద్ద సినిమా పోస్టర్ చూసినా ఎక్కువగా తమన్ పేరే కనిపిస్తుంది. సాంగ్స్ విషయంలో ఎలా ఉన్నా.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం తమన్.. బెస్ట్ ఇస్తూ ఉంటాడు. ఒక్కోసారి బలహీనమైన సన్నివేశాలకి కూడా తన ఆర్.ఆర్ తో ప్రాణం పోస్తుంటాడు. అందుకే మాస్ సినిమా అంటే తమన్ ఆర్.ఆర్ ఉండాల్సిందే అని స్టార్ హీరోల అభిమానులు డిమాండ్ చేస్తూ ఉంటారు.
ఇది పక్కన పెడితే.. కొంతమంది దర్శకులకి మాత్రం (Thaman) తమన్ ఎంతో ఉత్సాహంతో పనిచేస్తూ ఉంటాడు. త్రివిక్రమ్ సినిమాకి అయినా బోయపాటి శ్రీను సినిమాకి అయినా తమన్ చాలా మంది ఔట్పుట్ ఇస్తూ ఉంటాడు. బోయపాటి శ్రీను సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ పీక్స్ లో ఉంటాయి కాబట్టి.. తమన్ ఎంతో ఉత్సాహంగా బిజీయం వాయిస్తూ ఉంటాడు. ‘సరైనోడు’ ని మించి ‘అఖండ’ కి బెస్ట్ బిజీయం ఇచ్చాడు. లేటెస్ట్ గా వచ్చిన ‘స్కంద’ కి వాటిని మించాలి అనే ఉద్దేశంతో బాదుకుంటూ పోయాడు.
ఎంతలా అంటే ‘స్కంద’ సినిమా చూస్తున్న జనాలు థియేటర్ యాజమాన్యాన్ని రిక్వెస్ట్ చేసి మరీ సౌండ్ తగ్గించుకునేంతలా? అవును.. గుంటూరుకు చెందిన గౌరీ శంకర్ థియేటర్ యాజమాని తన ట్విట్టర్లో ఈ విధంగా రాసుకొచ్చాడు. ‘తమన్‌ను ఎవరైనా కంట్రోల్ చేయండి. లేదంటే థియేటర్లలో సౌండ్ సిస్టమ్స్ తట్టుకోలేకపోతున్నాయి.
‘స్కంద’ సినిమా ప్రదర్శన సందర్భంలో సౌండ్ పొల్యూషన్ ఎక్కువైందని ప్రేక్షకులే.. సౌండ్ తగ్గించాలని రిక్వెస్ట్ చేశారు. ఇది ప్రేక్షకులతో పాటు థియేటర్ల యాజమాన్యాలకు కూడా ఇబ్బందిగా మారింది’ అంటూ అతను రాసుకొచ్చాడు. దీనికి కొంత మంది నెటిజన్లు మీమ్స్ చేసి మరీ.. ట్రెండ్ చేస్తున్నారు.