కేవలం చిత్ర పరిశ్రమే కాదు యావత్ భారతదేశం గర్వించదగ్గ సినీ దర్శకులలో శంకర్ ఒకరు. ప్రతి సినిమాలోనూ సామజిక అంశాన్ని స్పృశిస్తూ, ఆ విషయాన్ని పలు కోణాల్లో ఆవిష్కరించి కమర్షియల్ హిట్ కొట్టడం ఆయనకే చెల్లింది. సాంకేతికతకూ ఆయన సినిమాలు పెట్టింది పేరు. గ్రాఫిక్స్ అనే పదాన్ని అప్పుడప్పుడే తెలుసుకుంటున్న తరుణంలో ‘జీన్స్’ సినిమాతో ఓ అద్భుతాన్ని తెరపై చూపించి ప్రేక్షకలోకాన్ని అబ్బురపరిచారు ఈ మేటి దర్శకుడు. అవకాశం చిక్కినప్పుడల్లా తన సినిమా పాటల్లో సాంకేతికతకు పెద్ద పీట వేసే శంకర్ 2010లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా ‘రోబో’తో భారతీయ సినిమా చరిత్రలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి మరో మెట్టు పైకి ఎక్కారు. ఆ సినిమాతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిన ఈ దర్శకుడు దానికి కొనసాగింపుగా ప్రస్తుతం ‘2.o’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇకపైన కూడా ఈ సినిమాకి సీక్వెల్స్ వచ్చే అవకాశం ఉందట. ఈ విషయాన్నీ నిన్నటి ఫస్ట్ లుక్ విడుదల కార్యక్రమంలో చెప్పుకొచ్చారు దర్శకుడు శంకర్.
భారతీయ సినిమా చరిత్రలోనే మొట్టమొదటి సారి మూడువందల యాభై కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రంగా ‘2.0’ ఖ్యాతి గాంచింది. ఈ సినిమా హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తక్కువ ఉండదని స్వయంగా అక్షయ్ కూడా నమ్మకంగా చెప్పుకొచ్చాడు.ఇక దర్శకుడు శంకర్ అయితే ‘రోబో’ కంటే పదింతలు ఈ సీక్వెల్ కోసం కష్టపడ్డానన్నారు. అందరూ ఇంతలా అభిమానం పెంచుకున్న ఈ మర మనిషికి చావే ఉండదట. అంటే.. ఈ సినిమాకి తర్వాతి భాగాలు కూడా చేసేందుకు శంకర్ సుముఖంగా ఉన్నారని అర్థం.ఈ విషయాన్ని శంకర్ కూడా ధృవీకరిస్తూ ఈ కథలో ఉన్న అంశం గొప్పదని, అందువల్ల ఎన్ని భాగాలైన తీయొచ్చని వ్యాఖ్యానించారు. హాలీవుడ్ సినిమాల్లో హ్యారీ పోటర్ వంటి సినిమాలు లెక్క లేనన్ని భాగాలుగా వచ్చి ప్రేక్షకులను మెప్పించాయి. ఇక మన దగ్గరకొస్తే.. క్రిష్ మినహా సైన్స్ ఫిక్షన్ కథలేవీ భాగాలుగా రూపొందలేదు. సూర్య నటించిన 24 సినిమాకి ప్రీక్వెల్ ఉంటుందని ఆ మధ్య విక్రమ్ కుమార్ చెప్పాడు తప్ప మిగిలిన వాటిల్లో దఫదఫాలుగా వచ్చినవి కొన్ని కమర్షియల్ సినిమాలే. శంకర్ ఈ ఫీట్ లో సక్సెస్ సాధిస్తారంటారా..?
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.