‘పోకిరి’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేష్ బాబుకి ప్లాపులు ఎదురయ్యాయి. ఆ తర్వాత వచ్చిన ‘సైనికుడు’ ‘అతిథి’ సినిమాలు కమర్షియల్ గా పర్వాలేదు అనిపించినా.. మహేష్ బాబుకి అవసరమైన హిట్స్ ను అందించలేకపోయాయి. దీంతో మహేష్ బాబు ఏడాది గ్యాప్ తీసుకుని ‘ఖలేజా’ మొదలుపెట్టాడు. కానీ ఆ సినిమా కంప్లీట్ అవ్వడానికి ఇంకో 2 ఏళ్ళు టైం పట్టింది.
మొత్తంగా 3 ఏళ్ళు మహేష్ కెరీర్లో గ్యాప్ వచ్చేసింది. అయినప్పటికీ ‘ఖలేజా’ కూడా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. మహేష్ బాబు తనని తాను కొత్తగా ఆవిష్కరించుకోవడంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఆ సినిమాతో తన కెరీర్ కు అవసరమైన హిట్ అందుకోలేకపోయాడు. దీంతో వెంటనే దర్శకుడు శ్రీను వైట్లతో చేతులు కలిపి ‘దూకుడు’ ని పట్టాలెక్కించాడు. ‘ఖలేజా’ రిలీజ్ అయిన ఏడాది లోపే ఆ సినిమాను విడుదల చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు మహేష్.
అయితే ‘దూకుడు’ సక్సెస్ కి మరో 2 సినిమాలు కూడా కారణమని గతంలో పలు ఇంటర్వ్యూలలో దర్శకుడు శ్రీను వైట్ల చెప్పడం జరిగింది.ఆ సినిమాలు మరేవో కావు.. ఒకటి నాగార్జున నటించిన ‘కింగ్’.. ఇంకోటి మహేష్ బాబు- త్రివిక్రమ్ కలయికలో వచ్చిన ‘ఖలేజా’. అవును ‘దూకుడు’ సక్సెస్ కి ఆ 2 సినిమాలు కారణమట. ఎలా అంటారా? శ్రీను వైట్ల.. నాగార్జునతో ‘కింగ్’ అనే సినిమా చేశారు.
అది పర్వాలేదు అనేలా ఆడింది కానీ అనుకున్న రేంజ్లో సక్సెస్ కాలేదు. కారణం ఆ సినిమాలో నాగార్జున బొట్టు శీను, కింగ్, శరత్ వంటి 3 పాత్రలు చేయడం. వీటి వల్ల ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వడంతో ఫలితం అనుకున్నట్టు రాలేదని శ్రీను వైట్ల తెలిపారు. అయితే ‘దూకుడు’ లో అలాంటి కన్ఫ్యూజన్ రాకుండా మహేష్ బాబుతో పోలీస్ ఆఫీసర్ అజయ్ కుమార్, ఎం.ఎల్.ఎ అజయ్ కుమార్, బళ్లారి బాబు వంటి 3 రకాల పాత్రలు చేయించానని, అవి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవ్వడంతో.. సినిమా సూపర్ హిట్ అయ్యిందని చెప్పుకొచ్చారు.
అలాగే మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ విషయంలో ‘ఖలేజా’ ని రిఫరెన్స్ గా తీసుకున్నానని.. ముఖ్యంగా కామెడీ టైమింగ్ ను ఎక్కువగా వాడుకున్నట్టు కూడా శ్రీను వైట్ల తెలిపారు.అలా ‘దూకుడు’ సక్సెస్ విషయంలో ‘ఖలేజా’ ‘కింగ్’ సినిమాల కాంట్రిబ్యూషన్ కూడా ఉందని అర్థం చేసుకోవచ్చు.