స్ట్రెయిట్‌గా పాయింట్‌కి వచ్చేద్దాం బ్రో… టాలీవుడ్‌లో పరిస్థితులపై చిరంజీవి కామెంట్లు చేయడం ఏమన్నా కొత్తా? కాదు కదా. చిరంజీవి మైక్ అందుకున్నప్పుడల్లా ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ పీపుల్ గురించి కచ్చితంగా ఏదో ఒక చురక అయితే వేస్తారు. గతంలో చాలాసార్లు చేశారు, ఇప్పుడు చేస్తున్నారు, తర్వాత చేస్తారు కూడా. ఆయన తత్వం తెలిసినవాళ్లు కచ్చితంగా ఇదే మాట చెబుతారు. అయితే ‘లాల్ సింగ్ చడ్డా’ ట్రైలర్ రిలీజ్ వేడుకలో చిరు చేసిన వ్యాఖ్యలకు ‘ఆచార్య’ ఫలితానికి ఎందుకు ముడిపెడుతున్నారో అర్థం కావడం లేదు.
కట్ చెప్పగానే క్యారవాన్లోకి వెళ్లిపోయి.. తిరిగి షాట్ ఓకే అంటే రావడానికి చాలా టైమ్ తీసుకుంటున్నారు, కట్ చెప్పగానే క్యారవాన్‌లోకి వెళ్లకుండా సెట్స్‌లోనే ఉంటే బాగుంటుంది, ఉండాలి — ఈ మాటలు చెప్పింది చిరంజీవే అనే విషయం తెలిసిందే. ఓ హీరోయిన్‌ను ఉద్దేశించి చిరంజీవి ఈ మాటలు అన్నారని అప్పుడు వార్తలొచ్చాయి. అప్పటికి ‘ఆచార్య’ రిలీజ్ అవ్వలేదు. కథ దొరికింది, కాంబినేషన్ సెట్ అయ్యింది అని షూటింగ్‌కి తొందరొద్దు.. అన్నీ రెడీ చేసుకొని వెళ్లాలి – ఈ మాట చెప్పింది కూడా చిరంజీవే. ‘ఆచార్య’ ప్రచారంలో భాగంగా అన్నారు.
ఇంకో విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ‘‘సినిమాకు సంబంధించి హీరోగా నా ఇన్‌పుట్స్ చెబుతాను. వాటిని తీసుకుంటే కలసి పని చేస్తాను. లేదంటే నా పని నేను చేసుకొని వెళ్లిపోతాను’’ అంటూ చిరంజీవి ఇటీవల యువ దర్శకులతో చెప్పాడు. ‘ఆచార్య’ విడుదల కాకముందు జరిగింది ఇది కూడా. ఇప్పుడు ‘సెట్స్‌లో డైలాగ్‌లు రాస్తున్నారు. దాని వల్ల నటులకు ఇబ్బంది’ అంటూ చిరంజీవి చెప్పాడు. గతంలో చిరంజీవి మీద వచ్చిన స్పందన వేరు, ఇప్పుడు స్పందన వేరు.
‘ఆచార్య’ సినిమా ఫ్లాప్‌కి కారణం ఎవరు? అనే చర్చ జరిగితే రెండు వైపులా తప్పులు బయటకు వస్తాయి. అలా అని ‘ఆచార్య’ ఫలితం దర్శకుడు తప్పిదమో, హీరో తప్పదిదమో అని ఒకరి మీదే నెట్టేయలేం. కాబట్టి చిరు మాటల్ని సూచనలు, వార్నింగ్‌లాగా తీసుకుంటే పరిశ్రమకు మంచిది. 150కిపైగా సినిమాల అనుభవం చెప్పే మాట తప్పైతే అది తప్పు అనుకోవాలి. ఇండస్ట్రీలో చిరంజీవి చెప్పినట్లు సెట్స్‌లో డైలాగ్‌లు రాసే రచయితలు, దర్శకులు లేరా? ఒకవేళ లేకపోతే చిరు చేసింది పెద్ద తప్పే.
చాలా సందర్భాల్లో మన హీరోలు, నటులే చెప్పారు మా దర్శకుడు సెట్స్‌లో స్పాంటేనియస్‌గా డైలాగ్‌లు భలే రాస్తారు అని.. పేర్లు ఇక్కడ ప్రస్తావన అక్కర్లేదు కానీ.. ముందుగా రాసుకుంటే బలంగా ఉంటుంది అనేది చిరంజీవి ఉద్దేశం. దానికి ‘ఆచార్య’ ఫలితం ముడిపెట్టి మాట్లాడితే ఏమొస్తుంది.