హీరోలను అభిమానించే వాళ్లూ ఉంటారు, ద్వేషించేవాళ్లూ ఉంటారు. ఎవరి మీద ఎవరికీ మనం ప్రేమాభిమానాలను పెంచలేం. అయితే ద్వేషం పెంచుకోకండి ఇదీ అసలు సంగతి అని మాత్రం చెప్పగలం. వారు గతంలో చేసిన మంచి పనులో, ఇప్పుడు చేస్తున్న పనులో చెప్పే ప్రయత్నం చేయొచ్చు. అలా ఓ ఇద్దరు అగ్ర హీరోల గురించి ప్రముఖ యాంకర్ సుమ చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇవి ఓ విధంగా ట్రోలర్ల కళ్లు తెరిపించే విషయాలే. కానీ వినడం, వినకపోవడం మీదే పరిస్థితి ఆధారపడి ఉంటుంది.
తెలుగు హీరోలకు దాన గుణం ఉంది అని మనకు తెలుసు. కొంతమంది బయటకు చెప్పి, ప్రెస్‌మీట్లు పెట్టి చేస్తారు. మరికొందరు గుప్తంగా చేస్తారు. అలాంటివారిలో పవన్ కల్యాణ్, ప్రభాస్ లాంటివాళ్లు ఉన్నారు. వారి గురించి ఇటీవల ఓ మీడియాలో మాట్లాడుతూ సుమ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. ఖమ్మంలో ఒక ఓల్డేజ్ హోమ్ నిర్మాణంలో తనకు పవన్ కల్యాణ్, ప్రభాస్ సాయం చేసారని సుమ తెలిపారు. వారితో పాటుగా మరికొందరు కూడా ఈ సహాయ కార్యక్రమంలో తోడ్పడ్డారని ఆమె తెలిపారు. ఆ వృద్ధాశ్రమంలో ఉండే పెద్దవారికి ప్రతీ నెలా యోగ క్షేమాల కోసం ప్రభాస్ డబ్బు పంపుతున్నారని సుమ తెలిపారు.
నిజానికి, ఇదేం తొలిసారి కాదు. గతంలో కొంతమంది జూనియర్ నటులు, చిన్న పాత్రలు వేసే వాళ్లు కూడా పవన్, ప్రభాస్ గురించి ఇలాంటి విషయాలు చెప్పుకొచ్చారు. వీరి గురించే కాదు.. ఎన్నో సమయాల్లో హీరోలు తమకు అండగా నిలిచారని కూడా చెప్పారు. అయితే ఈ విషయాలు పట్టించుకోకుండా ట్రోలింగ్ చేయడమే గొప్ప విషయం అనుకొని కొంతమంది నెటిజన్లు నోరు చేసుకుంటున్నారు. జీవితంలో ఏ రోజూ ఎవరికీ రూపాయి ఇవ్వనివాళ్లు.. ట్రోలింగ్ ద్వారా ఏం సాధిస్తారో మరి.