ఏడాదికి 18 సినిమాలు చేసిన హీరోలున్న ఇండస్ట్రీ మనది. తమిళంలోనూ ఇలాంటి హీరోలు, సినిమాలు ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో అలాంటి హీరోలు, సందర్భాలు తక్కువగానే ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ (నిప్పురవ్వ, బంగారుబుల్లోడు) ఒకే రోజు రెండు సినిమాలు విడుదల చేశారు. ఆ తర్వాత నాని (జెండాపై కపిరాజు, ఎవడే సుబ్రహ్మణ్యం’ చేశాడు. అయితే నెలలో ఏకంగా ఓ హీరో నుండి నాలుగు సినిమాలు వచ్చిన సందర్భంగా లేదు. ఇప్పుడు మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి ఈ పని చేస్తున్నాడు.
హీరో, విలన్…. ఇలా ఏ పాత్ర అయినా అందులో సేతుపతి మార్క్ కచ్చితంగా ఉంటుంది. అందుకే ఇటీవల కాలంలో వరుస విజయాలు, అవకాశాలతో దూసుకుపోతున్నాడు. అందులోని విజయ్ నటించిన నాలుగు సినిమాలు ఈ నెలలో విడుదల కాబోతున్నాయి. అందులో హీరోగా నటించినవి మూడు కాగా, ఒకటి ప్రత్యేక పాత్ర. విజయ్ సేతుపతి, జగపతిబాబు, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటించిన ‘లాభం’ఈ నెల 9న తమిళ, తెలుగు భాషల్లో విడుదలవుతోంది. ఆ తర్వాతి రోజే సన్ టీవీలో ‘తుగ్లక్ దర్బార్’ సినిమా విడుదల చేస్తున్నారు. ఇందులో రాశి ఖన్నా కథానాయిక. ఆ తర్వాతి రోజు నెట్‌ఫ్లిక్స్‌లోకి ఆ సినిమా వస్తుంది.
ఈ రెండూ కాకుండా… ఈ నెల 17న విజయ్ సేతుపతి-తాప్సి కలసి నటించి‘అనబెల్’విడుదలవుతోంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజవుతోంది. విజయ్ ప్రత్యేక పాత్రలో నటించిన ‘కడైసి వివసాయి’కూడా ఈ నెలలోనే వస్తుంది. ఈ నెల చివర్లో థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట.