నాగశౌర్య (Naga Shaurya) .. సినిమా ఇండస్ట్రీలో పరిచయస్థులు లేకుండా వచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు అంటారు. వరుసగా మంచి కథలు ఎంచుకుంటూ ప్రామిసింగ్ యంగ్ హీరోగా నిలిచాడు కూడా. ఇప్పుడు ఆయన కుటుంబమే ఆయనతో సినిమాలు నిర్మిస్తోంది కూడా. అయితే శౌర్య బంధువులు చాలా మంది ఇండస్ట్రీలో ఉన్నారని అంటుంటారు. ‘ఊహలు గుసగుసలాడే’ (Oohalu Gusagusalade) సినిమా సమయంలో చాలా మార్పుల తర్వాత శౌర్య వచ్చాడు అని కూడా అంటారు. అవన్నీ ఎంత వరకు నిజమో తెలియదు కానీ.. ఇప్పుడో విషయం బయటకు వచ్చింది.
నాగశౌర్యకు బాగా దగ్గర బంధువు ఇండస్ట్రీలో ఉన్నారు. ఏదో ఒకటో, రెండో సినిమాలు చేసిన మనిషి కూడా కాదు ఆమె. నాగశార్య మేనత్త ఓ తెలుగు సినిమాల్లో నటించిన ఫేమస్ నటి. ఆమె పేరే లతాశ్రీ. నాగశౌర్య తండ్రికి ఈమె స్వయానా చెల్లెలట. ఈజీగా గుర్తుకు రావడం లేదు అంటే ‘యమలీల’, ‘ఆ ఒక్కటీ అడక్కు’ లాంటి సినిమాల్లోని పాత్రలు గుర్తు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆమె అందులో ఆ పాత్రల్లో నటించారు కాబట్టి.
‘యమలీల’ సినిమాలోని ‘అభివందనం యమరాజా..’ అంటూ ఓ పాట పాడిన అమ్మాయి గుర్తుందా? ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమాలో రాజేంద్రప్రసాద్‌కు (Rajendra Prasad) సోదరిగా నటించిన అమ్మాయి గుర్తుందా? కృష్ణ ‘నెంబర్ వన్’, ఈవీవీ ‘జంపలకిడి పంబ’.. ఇలా చాలా సినిమాల్లో ఆమె నటించింది. దక్షిణాదిలో లతాశ్రీ అలా 70 కిపైగా సినిమాల్లో నటించారు. ఆ తర్వాత అంటే 1999 సమయంలో ప్రేమ వివాహం చేసుకుని ఇండస్ట్రీకి దూరమయ్యారు.
2007లో ఈవీవీ సత్యనారాయణ (E. V. V. Satyanarayana) తెరకెక్కించిన ‘అత్తిలి సత్తిబాబు’ చిత్రంతో మళ్లీ ఎంట్రీ ఇచ్చినా కంటిన్యూ చేయలేదు. ఆమెనే నాగశౌర్యకు మేనత్త. అయితే రెండు కుటుంబాల మధ్య అంత ర్యాపో లేదట. కారణాలు తెలియవు కానీ.. ఎక్కడా రెండు కుటుంబాలు కలసి కనిపించవు. చూద్దాం భవిష్యత్తులో అయినా రెండు కుటుంబాలు.. సీనియర్ నటి – యంగ్ హీరో కలసి కనిపిస్తారేమో.