బిగ్ బాస్ లో మొదటివారం నామినేషన్స్ కి ఈసారి పోటీ పెట్టాడు బిగ్ బాస్. నామినేషన్స్ లో ఒకరినొకరు నేరుగా నామినేట్ చేసుకోవచ్చని రీజన్స్ వెతుక్కుంటున్న హౌస్ మేట్స్ కి షాక్ ఇచ్చాడు. నామినేషన్స్ లో భాగంగా హౌస్ మేట్స్ ని మూడు తరగతులుగా విభజించాడు. క్లాస్ – మాస్ – ట్రాష్. ట్రాష్ లో ఉన్న సభ్యులు నేరుగా నామినేట్ అవుతారని చెప్పాడు. దీంతో హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా ట్రాష్ లో ముగ్గురిని ఎంచుకున్నారు.
రేవంత్, సుల్తానా, గీతురాయల్ కి ఎక్కువగా ఓట్లు పడ్డాయి. అలాగే, క్లాస్ లో బాలాదిత్య, శ్రీహాన్, ఆర్జే సూర్యలకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. మిగతా సభ్యులు మాస్ టీమ్ లో ఉన్నారు. ఇక్కడే ఛాలంజస్ వచ్చినపుడు గెలిచిన ఇంటి సభ్యులు తరగతిని మార్చుకోవచ్చని, మాస్ వాళ్లు క్లాస్ లోకి , ట్రాష్ వాళ్లు మాస్ లోకి ఎగబాకవచ్చని చెప్పాడు బిగ్ బాస్. మొదటి టాస్క్ లో గెలిచిన మాస్ సభ్యుడైన ఆదిరెడ్డి క్లాస్ టీమ్ లోకి వచ్చాడు.
క్లాస్ టీమ్ లో ఉన్న శ్రీహాన్ స్వాప్ అయ్యి మాస్ టీమ్ లోకి వచ్చాడు. ఇక హౌస్ లో ట్రాష్ టీమ్ లో ఉన్న ముగ్గురు అలాగే ఉన్నారు. అయితే, ఇక్కడే కేవలం ముగ్గుర్ని మాత్రమే ఈవారం నామినేషన్స్ లోకి తీస్కుని వస్తారా లేదా మాస్ టీమ్ లో నుంచీ కొంతమందిని తీస్కుని వస్తారా అనేది ఆసక్తిగా మారింది. మొదటి వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా క్లాస్ టీమ్ లో ఉన్నవారు నేరుగా కెప్టెన్సీ పోటీదారులు అవుతారు. అలాగే మాస్ టీమ్ లో మరికొంతమందికి ఈ అవకాశం వస్తుంది అని చెప్పాడు.
అలాగే, ఇప్పుడు ట్రాష్ టీమ్ లో ఉన్నవారు నేరుగా నామినేట్ అయినపుడు , మాస్ టీమ్ లో ఉన్న కొంతమంది కూడా నామినేషన్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. హౌస్ మేట్స్ ఓటింగ్ ద్వారా దీన్ని నిర్ణయిస్తే మాత్రం ఖచ్చితంగా తర్వాత వారానికి హౌస్ మేట్స్ కి బలమైన కారణాలు కనిపిస్తాయి. ఇప్పుడిప్పుడే హౌస్ మేట్స్ సెటిల్ అవుతున్న నేపథ్యంలో ఈవారం నామినేషన్స్ ఆసక్తికరంగా మారాయి. మరి ఈరోజు ఆటలో ఎవరు ట్రాష్ లో మిగులుతారు ? ఎవరు నామినేట్ అవుతారు అనేది చూడాలి.