ఆ ట్రోల్స్ చాలా ఫన్నీగా ఉన్నాయంటున్న తారలు

  • September 5, 2018 / 06:17 AM IST

“విజయం వచ్చినప్పుడు విర్రవీగొడ్డు, అపజయం వచ్చినప్పుడు క్రుంగిపోవద్దు” అని చెప్పడం ఎంత సులభమో.. దాన్ని పాటించడం చాలా అంటే చాలా కష్టం. విజయం, అపజయం అనేవి పక్కన పెడితే.. అవమానాన్ని తట్టుకోవడం అనేది మిక్కిలి కష్టమైన పని. పురాణాల్లో అవమానం అని పిలుచుకున్న అదే పదాన్ని నవతారంలో కాస్త అప్డేట్ చేసి “ట్రోల్” అని పిలుస్తున్నారు. మొదట్లో కాస్త సరదాగా ఉండే ఈ ట్రోలింగ్ ఈమధ్యకాలంలో ఎక్కువైన సోషల్ మీడియా పుణ్యమా అని శ్రుతి మించుతోంది. ఒకర్నిమించి మరొకరు తమ క్రియేటివిటీ ప్రూవ్ చేసుకోవడం కోసం ఈ ట్రోలింగ్ ను వాడుకోవడం మొదలెట్టారు.

ఈ ట్రోల్ ను కొంతమంది సరదాకి తీసుకొంటే కొందరు సీరియస్ గా తీసుకొని రివర్స్ అవుతున్నారు. అలా రివర్స్ అయినవాళ్లని ఇంకాస్త ట్రోల్ చేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నారు ఈ ట్రోల్ క్రియేటర్స్. అందుకే ట్రోల్స్ పై స్పందించడం కంటే వాటిని చూసి నవ్వి వదిలేస్తున్నారు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇలా ట్రోల్స్ ను స్వాగతించడానికి పునాది వేశారు. ఆయన నటించిన “కసబ” అనే సినిమా ఫస్ట్ లుక్ రిలీజైనప్పుడు ఆయన స్టిల్ మీద విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. ఆ ట్రోల్స్ ను ఆయనే స్వయంగా తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఆలియా భట్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ వంటివారు కూడా ఈ ట్రోల్స్ & మీమ్స్ ను పాజిటివ్ గా తీసుకొన్నారు. రీసెంట్ గా మోహన్ బాబు కూడా తనపై వస్తున్న “ఫసక్ జోక్స్”పై స్పందిస్తూ “భలే ఫన్నీగా ఉన్నాయి” అంటూ ట్వీట్ చేయడం దానికి మనోజ్ తోడై “మీరు పెట్టిన కూడు తింటున్నాం. ఆ హక్కు మీకుంది” అని ట్వీట్ చేయడంతో అప్పటివరకూ ట్రోల్ చేసినవాళ్లు కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలెట్టారు. ఈ జాబితాలో అనుష్క శర్మ కూడా చేరింది. ఆమె తాజా చిత్రం “సూయి దాగా” ట్రైలర్ విడుదలవ్వగా.. ఆ ట్రైలర్ లో అనుష్క ఎక్స్ ప్రెషన్స్ కొన్ని భీభత్సమైన హల్ చల్ సృష్టించాయి. వాటిపై అనుష్క రెస్పాండ్ అవుతూ.. “ఆ మీమ్స్ అన్నీ చాలా ఫన్నీగా ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ అన్నీ మీమ్స్ చూశాను. నాకు ఇబ్బందికరంగా ఏమీ అనిపించలేదు” అని చెప్పడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus