మల్టీ లాంగ్వేజ్ సినిమాలు ఈ మధ్య కాలంలో చాలా కనిపిస్తున్నాయి. అయితే అన్నింటిలో ఒకే హీరో, ఒకే టీమ్ ఉంటారు. కానీ మూడు భాషల్లో సినిమా తెరకెక్కుతూ.. మూడింటిలో ముగ్గురు హీరోలు ఉండటం చాలా అరుదు. అలాంటి సినిమా ఒకటి ప్రస్తుతం తెరకెక్కుతోంది. ఆ సినిమా తెలుగు వెర్షన్లో నవీన్ చంద్ర నటించబోతున్నాడు. అంతేకాదు ఇందులో నవీన్ చంద్ర పోలీసుగా కనిపించబోతున్నాడు. పోలీసు పాత్రలో నవీన్‌చంద్ర ఎలా ఉంటాడో ఇప్పటికే ‘నేను లోకల్’లో చూశాం. ఆ లెక్కన ఇందులో కూడా అదరగొట్టే అవకాశాలు ఉన్నాయి.
అరవింద్ అనే తమిళ దర్శకుడు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఒకే సారి సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగు వెర్షన్లో నవీన్‌చంద్ర హీరో కాగా, తమిళ వెర్షన్‌కు అరుల్‌నిథి తమిళరసు హీరో. ఈయన దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిథి మనవడు కావడం గమనార్హం. ఇక కన్నడ వెర్షన్‌కు హీరోను ఫైనలైజ్ చేయాల్సి ఉందట. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. మిస్టరీ కేస్‌ను ఛేదించే క్రమంలో ఓ పోలీసు ఎదుర్కొనే అనుభవాల సారమే ఈ సినిమా అట. ఫిబ్రవరి 1 నుంచి సినిమా చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. దీని కోసం నవీన్ చంద్ర మూడు వారాల కాల్‌షీట్స్ ఇచ్చాడట.
ఒకే సినిమాను ఇద్దరు, ముగ్గరు హీరోలతో వేర్వేరు భాషల్లో తెరకెక్కించడం ఇటీవల కాలంలో అరుదే. గౌతమ్ వాసుదేవ్ మేనన్ లాంటి దర్శకులు ఇటీవల ఈ పని చేస్తున్నారు. ‘ఏ మాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ లాంటి సినిమాలు రెండు భాషల్లో, ఇద్దరు హీరోలతో తీశారు. ఇన్నాళ్లకు వేరే దర్శకుడు ఇలా సినిమా తీయడం ఆసక్తికరమే.