కరోనా – లాక్‌డౌన్ పరిస్థితుల తర్వాత థియేటర్లకు జనాలు రావడం తగ్గింది అని అంటుంటారు కానీ… ఆ రెండూ రాకముందే జనాలు రాక తగ్గించారు అని చెప్పాలి. కావాలంటే ఓసారి రివైండ్ వేసుకోండి… థియేటర్లలో సినిమా టికెట్ల రేట్లు పెంచిన తర్వాత జనాల రాక తగ్గిందనే వార్తలు మీరు గతంలో విని ఉంటారు కూడా. ఆ విషయం ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా? సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తే వచ్చే లాభం ఏంటో మరోసారి ఇప్పుడు కనిపించింది కాబట్టి.
సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప చాలా మంది మల్టీప్లెక్స్ వైపు చూడటం లేదు అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. టికెట్ రేట్స్ తగ్గిస్తే మామూలు సినిమాలు కూడా జనాలు చూస్తారు అనడానికి ఓ రుజువు మా దగ్గర ఉంది. అదే నేషనల్ సినిమా డే. దేశీయ సినిమా రోజు అంటూ ఇటీవల కాలంలో ఏటా నిర్వహిస్తూ వస్తున్నాయి. గతేడాది తమకు అనువుగా డేట్ మార్చుకున్నారు అనుకోండి.
ఈ ఏడాది అయితే అక్టోబరు 13న నిర్వహించారు. ఆ రోజు థియేటర్లకు వచ్చిన జనాల లెక్కే ఇక్కడ విషయం. నేషనల్ సినిమా డే సందర్భంగా మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా టికెట్ రేట్స్ తగ్గించి అమ్మిన విషయం తెలిసిందే. 99 రూపాయలకే టికెట్ ఇచ్చారు. 4300 మల్టీప్లెక్స్ స్క్రీన్లలో లెక్కలు ప్రకారం ఆ రోజున మల్టీప్లెక్స్‌ల్లో 60 లక్షలమందికిపైగా సినిమాలు చూశారట. షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాకు (National Cinema Day) అక్టోబర్ 13న రూ. ఐదు కోట్లు వచ్చాయట.
అంతకుముందు సుమారు రూ. 70 లక్షలు వచ్చాయని సమాచారం. అలా అని మొత్తంగా నష్టానికి సినిమా వేయమని కాదు… సినిమా వచ్చిన కొన్ని రోజుల తర్వాత అయినా తగ్గిస్తే బాగుంటుంది అని కొంతమంది సూచన. ఈ సినిమా మాత్రమే కాదు అక్షయ్ కుమార్ ‘మిషన్ రాణిగంజ్’, భూమి పెడ్నేకర్ ‘థాంక్ యు ఫర్ కమింగ్’, మన సినిమా ‘మ్యాడ్’కు అక్టోబర్ 13న మంచి వసూళ్లే వచ్చాయి అని సమాచారం.