2018 టాలీవుడ్ కి బాగానే కలిసొచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం వచ్చిన చాలా చిత్రాలు అసాధారణ విజయాల్ని సొంతం చేసుకున్నాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా తెలుగు సినిమా స్టామినా ఏంటనేది మరోసారి తెలియజేశాయి. ఒక్క ‘బాహుబలి’ సిరీస్ పక్కన పెడితే మిగిలిన సినిమాలు 1 మిలియన్ రాబట్టడానికి చాలా కష్టపడేవి. అయితే ఇప్పుడు అది అందరికీ ‘కేక్ వాక్’ అయిపోయిందనే చెప్పాలి. ఇప్పుడు 2మిలియన్ మాత్రమే కాదు 3 మిలియన్ ను కూడా దాటేస్తున్నాయి.
ఇక 2018 లో ఓవర్సీస్ ముఖ్యంగా యూ.ఎస్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రం గా ‘రంగస్థలం’ మొదటి స్థానంలో నిలిచింది. మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత నటించిన ఈ చిత్రం మార్చి 30 న విడుదలై బాక్సాఫీస్ ను ఊపు ఊపిందనే చెప్పాలి. ముఖ్యంగా మన లెక్కల మాస్టారు సుకుమార్ చిత్రాలకి అక్కడ మంచి మార్కెట్ ఉండటంతో ‘రంగస్థలం’ సూపర్ కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం తరువాత టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ చిత్రం తరువాతి స్థానంలో నిలిచింది. మన మహేష్ బాబు యూ.ఎస్ మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక పక్క ‘అవెంజర్స్’ చిత్రం పోటీని తట్టుకుని కూడా సూపర్ కలెక్షన్స్ ను రాబట్టింది ‘భరత్ అనే నేను’ చిత్రం. అలాగే కీర్తి సురేష్ నటించిన ‘మహనటి’ చిత్రం కూడా అమెరికాలో కలెక్షన్ల వర్షం కురిపించింది. మహానటి సావిత్రి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని వసూళ్ళలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇక ఈ చిత్రాలతో పాటు సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత’ చిత్రాలు యూఎస్ఏ లో మంచి వసూళ్లను రాబట్టడం విశేషం.