ఈసారి దసరా, దీపావళి పండుగల సమయంలో కూడా బాక్సాఫీస్ కాస్త డల్‌గా ఉంది. కానీ డిసెంబర్‌లో ఆ లోటును భర్తీ చేయడానికి క్రేజీ సినిమాలు క్యూ కడుతున్నాయి. భారీ యాక్షన్ డ్రామాల నుంచి హిలేరియస్ కామెడీ ఎంటర్‌టైనర్ల వరకు.. ఈ ఏడాది ఆడియన్స్‌కు ఫుల్ మీల్స్ గ్యారెంటీ. మరి డిసెంబర్ బరిలో నిలుస్తున్న ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.
డిసెంబర్ ఫైట్‌ను మొదలుపెట్టేది నటసింహం బాలకృష్ణనే. బోయపాటి శ్రీను, బాలయ్య కాంబోలో వచ్చిన ‘అఖండ’ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయడానికి ‘అఖండ 2’తో డిసెంబర్ 5న థియేటర్లలోకి అడుగుపెడుతున్నారు. ఈసారి అంతకుమించి అనేలా పాన్-ఇండియా రేంజ్‌లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. దీంతో అంచనాలు ఆకాశాన్ని అంటనున్నాయి.
మిడ్-డిసెంబర్‌లో ‘మోగ్లీ’ ఎంట్రీ ఇవ్వబోతుంది.‘కలర్ ఫోటో’తో నేషనల్ అవార్డ్ అందుకున్న సందీప్ రాజ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా ‘మోగ్లీ’. యంగ్ హీరో రోషన్ కనకాల ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
క్రిస్మస్ బరిలో నువ్వా-నేనా..?డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా బాక్సాఫీస్ దగ్గర అసలైన క్లాష్ జరగనుంది. ఇద్దరు యంగ్ హీరోలు తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. ‘పెళ్లిసందడి’ తర్వాత శ్రీకాంత్ తనయుడు రోషన్ మేక హీరోగా నటిస్తున్న సినిమా ‘ఛాంపియన్’. వైజయంతీ మూవీస్, స్వప్నా సినిమాస్ లాంటి టాప్ బ్యానర్లు నిర్మిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌కు మంచి హైప్ ఉంది. పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇక ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్ కేవీ, మాస్ క దాస్ విశ్వక్ సేన్ కాంబోలో వస్తున్న సినిమా ‘ఫంకీ’. రీసెంట్‌గా రిలీజైన టీజర్ చూస్తేనే నవ్వులు గ్యారెంటీ అనిపిస్తోంది. ఇది పక్కా అనుదీప్ మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని టాక్. క్రిస్మస్‌కు ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ స్ట్రెయిట్ తెలుగు సినిమాలే కాకుండా, తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా డిసెంబర్‌లో సందడి చేసే అవకాశం ఉంది. కార్తీ ‘వా వాతియార్’, జయం రవి ‘జీనీ’ వంటి సినిమాలు మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నాయి. అలాగే, ‘లవ్ టుడే’ ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ నటిస్తున్న ‘ఎల్ ఐ సి(LIC)’ కూడా డిసెంబర్‌లో వచ్చే ఛాన్స్ ఉంది.మొత్తానికి, డిసెంబర్ నెల బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరగనుంది. మరి ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించి విజేతగా నిలుస్తుందో చూడాలి.