ప్రముఖ టాలీవుడ్ నటుడు, దర్శకుడు గిరిధర్ కన్నుమూశారు. ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన గిరిధర్ అప్పటినుంచి మంచానికే పరిమితమయ్యారు. తిరుపతిలోని స్వగృహంలో గిరిధర్ నిన్న తుదిశ్వాస విడిచారు. 1957వ సంవత్సరం మే నెల 21వ తేదీన చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని ఇరంగారి పల్లెలో గిరిధర్ జన్మించారు. ప్రముఖ టాలీవుడ్ దర్శకులు గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ, కోదండ రామిరెడ్డి దగ్గర గిరిధర్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.
1982 సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గిరిధర్ శుభముహూర్తం అనే సినిమాకు దర్శకత్వం వహించి దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే విజయాన్ని సొంతం చేసుకున్నారు. శుభముహూర్తం సినిమాలో ఆమని, ఇంద్రజ, వినోద్ కుమార్, చంద్రమోహన్ ప్రధాన పాత్రల్లో నటించారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు గిరిధర్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు. 20కు పైగా తెలుగు సినిమాల్లో గిరిధర్ నటించారు. 100 % లవ్, శ్రీమంతుడు, ఎక్స్ ప్రెస్ రాజా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలు నటుడిగా గిరిధర్ కు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
అన్నవరం, వన్ నేనొక్కడినే, సుప్రీం మరికొన్ని సినిమాలకు గిరిధర్ కో డైరెక్టర్ గా పని చేశారు. కొన్ని రోజుల క్రితం స్టార్ డైరెక్టర్ సుకుమార్ గిరిధర్ ను పరామర్శించి వెళ్లారని సమాచారం. గిరిధర్ మృతితో ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. వరుసగా ఆఫర్లతో బిజీగా ఉన్న సమయంలోనే యాక్సిడెంట్ కావడం వల్ల గిరిధర్ ఎక్కువ సినిమాల్లో నటించలేదు.