ఒకప్పుడు తమిళంలో ఏదైనా సినిమా హిట్ అయితే చాలు.. దాని రీమేక్ హక్కుల కోసం మన నిర్మాతలు ఎగబడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. గత నాలుగైదేళ్లలో మలయాళం కంటెంట్ లో నాణ్యత పెరిగింది. కమర్షియల్ టచ్ ఇస్తూనే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే అద్భుతమైన సబ్జెక్టులతో సదరు దర్శకనిర్మాతలు చేస్తున్న మ్యాజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ రీసెంట్ గా నటించిన ‘భీమ్లానాయక్’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలు రెండూ కూడా మలయాళం నుంచి తెచ్చుకున్న కథలే.
ఈ రెండు సినిమాలు తెలుగులో బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. ఇప్పుడు మరో మలయాళ సినిమాపై టాలీవుడ్ దర్శకనిర్మాతల దృష్టి పడినట్లు తెలుస్తోంది. ఇటీవల మమ్ముట్టి నటించిన ‘రోర్సాచ్’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ తో దూసుకుపోతుంది. నిసం బషీర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజానికి ఈ సినిమాను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయాలని ప్రముఖ ఓటీటీ సంస్థ ప్రయత్నించింది.
భారీ మొత్తాన్ని కూడా ఆఫర్ చేసింది. కానీ చిత్రబృందం ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సినిమా దూసుకుపోతుంది. హైదరాబాద్ లో కూడా పలు మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఇదొక రివెంజ్ డ్రామా. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంటుంది. హీరో ఎన్నారై. తన భార్య కనిపించడం లేదని.. పోలీసులకు కంప్లైంట్ చేస్తాడు. యాక్సిడెంట్ జరిగిన తరువాత స్పృహలోకి వచ్చి చూస్తే తన భార్య మిస్ అయిందని చెబుతాడు.
ఆమె దొరికేవరకు తిరిగి ఫారెన్ వెళ్లే ప్రసక్తే లేదని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో ఆ ఊర్లో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. ఆ తరువాత ఏం జరిగిందనేదే ఈ సినిమా. ఎంతో థ్రిల్లింగ్ గా సాగే ఈ సినిమాను తెలుగులో ఏ హీరో రీమేక్ చేస్తారో చూడాలి!