తెలుగులో భారీ విజయాలు అందుకున్న దర్శకలు, మాస్ హీరోలను బాగా హ్యాండిల్ చేస్తారు అని పేరున్న దర్శకులు బాలీవుడ్‌కి వెళ్లి సినిమాలు చేస్తుండటం మనం ఇప్పుడు చూస్తున్నాం. ‘పాన్ ఇండియా ఫీవర్’ ఎక్కువైన తర్వాత ఇలాంటి దర్శకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అయితే ఓ యువ దర్శకుడు బాలీవుడ్ వెళ్లి అక్కడ డెబ్యూ సినిమా చేస్తున్నారు. అవును, మీరు చదివింది నిజమే. ఇక్కడ సినిమా నిర్మాణంలో, రైటింగ్‌లో చిన్నపాటి అనుభవం ఉండటం గమనార్హం.
చరణ్ తేజ్ ఉప్పలపాటి.. ఈ పేరు మీరు ఇప్పటికే విని ఉండొచ్చు. నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) ప్రధాన పాత్రలో రూపొందిన ‘స్పై’ (Spy) సినిమా నిర్మాతల్లో చరణ్ తేజ్ ఒకరు. సినిమా టైటిల్ కార్డ్స్‌లో ఆయన పేరు ముందు సీఈవో అని వేశారు. ఇప్పుడు ఆయనే ఓ పెద్ద సినిమాతో బాలీవుడ్‌లో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రభుదేవా (Prabhudeva) – కాజోల్ (Kajol) ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న సినిమాకు చరణ్‌తేజ్ దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం.
‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) , ‘బింబిసార’ (Bimbisara) ‘విరూపాక్ష’ (Virupakasha), ‘సార్’ (Sir) తదితర చిత్రాలతో లక్కీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న మలయాళ బ్యూటీ సంయుక్త (Samyuktha Menon) ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురించి ఇప్పుడు బాలీవుడ్‌లో మాట్లాడుకుంటున్నారు. అలాగే మనకు నిర్మాతగా తెలిసిన అక్కడి దర్శకుడి గురించి కూడా మాట్లాడుతున్నారు.
దర్శకుడిగా తెలుగులో సినిమాలేవీ చేయకుండా ఈ కుర్రాడికి నేరుగా బాలీవుడ్‌లో అవకాశం దక్కడంతో ఇదేలా సాధ్యం అయింది అంటూ అదో రకం చర్చ కూడా జరుగుతోంది సినిమా వర్గాల్లో. ఇక ఈ సినిమాకు నిర్మాత ఎవరన్నది తెలియాల్సి ఉంది. అఇయతే చరణ్ తేజ్ సొంతంగా నిర్మిస్తున్నారనే చర్చ కూడా జరుగుతోంది. మరో విషయం ఏంటంటే.. ‘స్పై’ సినిమాకు కథ – స్క్రీన్ ప్లే నిర్మాతలే చూసుకున్నారట. ఆ అనుభవంతోనే చరణ్ ఉప్పలపాటి ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్నారేమో. చూద్దాం మరి ఎలాంటి సినిమా తీస్తారో.