సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్స్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకూ హారర్ సినిమాలు కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాకపోయినా, ఇప్పుడేమో టాలీవుడ్ హీరోలు వరుసగా భయపెట్టే కథలను ఎంచుకుంటున్నారు. హిందీలో స్త్రీ 2 (Stree 2) ఏకంగా 800 కోట్లు రాబట్టింది. ఇక తెలుగులో గతంలో వచ్చిన విరూపాక్ష (Virupaksha) (2023) 100 కోట్లు అందుకుంది. భారీ విజయాన్ని సాధించడంతో పాటు, హారర్ థ్రిల్లర్ సినిమాల మీద ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. అంతే కాదు, అంచనాలు లేకుండా విడుదలైన మా ఊరి పొలిమేర 2 (Maa Oori Polimera 2) కూడా మంచి విజయాన్ని సాధించింది.
ఈ రెండూ పెద్ద హీరోల (Heroes ) సినిమాలు కాకపోయినా, టికెట్ కౌంటర్ల దగ్గర వసూళ్లు రాబట్టడం చూస్తే, హారర్ జానర్‌కు మంచి ఫ్యూచర్ ఉందని తేలిపోయింది. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు కూడా దెయ్యాల జానర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అల్లరి నరేష్ నటిస్తున్న 12th రైల్వే కాలనీ సినిమా పూర్తి హారర్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ కథను వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తుండడం, సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. అలాగే సుశాంత్ (Sushanth) హీరోగా ఓ భూత వైద్యుడి పాత్రలో నటిస్తున్న సినిమా కూడా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది.
ఈ సినిమా సూపర్ నేచురల్ థ్రిల్లర్ మిక్స్‌గా ఉంటుందని సమాచారం. ఇదే ట్రెండ్‌ను మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) కూడా ఫాలో అవుతున్నాడు. మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో ఆయన చేస్తున్న కొరియన్ కనకరాజ్ ఓ కామెడీ హారర్ సినిమాగా తెరకెక్కుతోంది. రాయలసీమ నేపథ్యంలో దెయ్యాలు, భూత వైద్యంపై ఆసక్తికరమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. మరోవైపు రాక్షసుడు (Rakshasudu) ఫేమ్ రమేశ్ వర్మ (Ramesh Varma) కూడా లారెన్స్ తో (Raghava Lawrence) హారర్ థ్రిల్లర్ తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.
ప్రస్తుతం స్క్రిప్ట్ ఫైనల్ స్టేజ్‌లో ఉందని తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా హారర్ ఎలిమెంట్స్ ఉన్న కథను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. మారుతి (Maruthi Dasari) దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ (The Rajasaab) సినిమా మూడు తరాల ఆత్మల కథను ఆధారంగా తీసుకుని కామెడీ టచ్‌తో తెరకెక్కుతోంది. ప్రభాస్ (Prabhas) స్టార్ పవర్‌ను ఉపయోగించుకుని ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, టాలీవుడ్ ఇప్పుడు భయభూతాల ప్రపంచంలోకి అడుగుపెట్టింది. మరి, ఈ కొత్త ప్రయోగాలు ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాయో చూడాలి.