విజయ్ సేతుపతి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.’పేట’ ‘సైరా నరసింహరెడ్డి’ ‘ఉప్పెన’ ‘మాస్టర్’ వంటి చిత్రాలు అతనికి తెలుగులో మంచి క్రేజ్ ఏర్పడేలా చేసాయి. అంతకు ముందు విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘పిజ్జా’ కూడా బాగానే ఆడింది. కానీ ఆ సినిమాలో నటించింది విజయ్ సేతుపతి అని అప్పటికి మన తెలుగు జనాలు గుర్తించలేదు. ఆ సినిమా హిట్టయినప్పటికీ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకే ఆ క్రెడిట్ దక్కింది తప్ప విజయ్ సేతుపతికి కలిసొచ్చింది ఏమీ లేదు. అయితే అప్పటికంటే ఇప్పుడు విజయ్ సేతుపతికి ఇక్కడ మంచి క్రేజ్ నెలకొంది.
కానీ అతన్ని హీరోగా యాక్సెప్ట్ చేసేంత కాదు. ఇటీవల విడుదలైన ‘లాభం’ మూవీతో ఆ విషయం ప్రూవ్ అయ్యిందని కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట ఇది. విజయ్ సేతుపతి హీరోగా శృతీ హాసన్ హీరోయిన్ గా జగపతి బాబు కీలక పాత్రలో నటించిన ‘లాభం’ మూవీ మొన్న అంటే సెప్టెంబర్ 9న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఆ చిత్రాన్ని పట్టించుకున్న ప్రేక్షకులే లేరు. తెలుగులో ఈ చిత్రాన్ని రూ.80 లక్షలకు విక్రయించారు. కానీ ఇప్పటివరకు ఈ చిత్రం రూ.10 లక్షల షేర్ ను కూడా వసూల్ చేయలేకపోయింది.
దాంతో బయ్యర్లకు రూ.70 లక్షల వరకు నష్టాలు తప్పేలా లేవు. అంతేకాదు ‘విజయ్ సేతుపతి’ ‘విక్రమార్కుడు’ వంటి చిత్రాలు కూడా తెలుగులో రిలీజ్ అయ్యాయి. అవి వచ్చి వెళ్ళినట్టు కూడా చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలీదు. ఇటీవల ‘ఆహా’ లో రిలీజ్ అయిన ‘సూపర్ డీలక్స్’ తెలుగు వెర్షన్ ను కూడా ప్రేక్షకులు పెద్దగా పట్టించోకోలేదు. ఆఫర్స్ వచ్చాయి కదా, క్రేజ్ ఉంది కదా అని ఏ సినిమా పడితే ఆ సినిమా చేసేస్తే ఇలాంటి ఫలితాలే చవి చూడాల్సి వస్తోంది.