ఎన్నికల్లో పోటీ.. పవన్ కళ్యాణ్ గారు అడిగారు కానీ: బన్నీవాస్

టాలీవుడ్‌లో నిర్మాతగా తనదైన ముద్ర వేసుకున్న బన్నీ వాస్ (Bunny Vasu), సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ రంగంలోనూ చర్చకు వస్తున్నారు. గీతా ఆర్ట్స్‌కి కీలకమైన వ్యక్తిగా మారిన ఆయన, అల్లు అర్జున్‌కి  (Allu Arjun) అత్యంత సన్నిహితుడు. అయితే గత ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా బరిలో దిగుతారనే ప్రచారం భారీగా జరిగింది. గోదావరి జిల్లాలో ఆయనకు టికెట్ దాదాపు ఖరారైనట్టే అనిపించినా, చివరికి బన్నీ వాస్ పోటీ చేయలేదు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ప్రత్యేకంగా అడిగినప్పటికీ, తానే వెనుకంజ వేసినట్లు బన్నీ వాస్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

Bunny Vasu

తండేల్ (Thandel) ప్రమోషన్స్‌లో భాగంగా, పొలిటికల్ ఎంట్రీపై మాట్లాడిన ఆయన, రాజకీయాల్లోకి వెళ్లడం అంత సులభం కాదని, పూర్తి స్థాయిలో కమిట్‌మెంట్ అవసరమని అన్నారు. ఒకసారి రాజకీయాల్లోకి వెళ్ళాక, సినిమాల్ని వదిలిపెట్టి, ప్రజా జీవితానికి అంకితం కావాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుత దశలో ఆ బాధ్యతను తీసుకోవడం తనకు కష్టమని బన్నీ వాస్ చెప్పుకొచ్చారు. “పవన్ సర్‌తో కలిసి పనిచేయాలంటే పూర్తి స్థాయిలో ఎంగేజ్ అవ్వాలి. అది సగం చేయడం కుదరదు. నేను ఇంకా ఎదుగుతున్న సమయంలో ఉన్నాను.

రాజకీయాల్లోకి వెళ్లాలంటే, ముందు నా ఫైనాన్షియల్ స్థిరత్వం, కుటుంబ భవిష్యత్తు అన్నీ దృష్టిలో పెట్టుకోవాలి” అని పేర్కొన్నారు. అంతేకాదు, జనసేన తరఫున తనకు టికెట్ దొరికే అవకాశమున్నా, తాను వెనక్కి తగ్గినట్లు బన్నీ వాస్ వెల్లడించారు. “ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి. పక్కన పెట్టి మళ్ళీ వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. అందుకే ఎన్నికల్లో నిలబడటానికి సిద్ధం కాలేదు” అని వివరించారు.

అయితే, భవిష్యత్తులో రాజకీయాల్లోకి వెళ్లే అవకాశాన్ని పూర్తిగా తిరస్కరించలేదు. ప్రస్తుతం బన్నీ వాస్ సినిమాలపై ఫోకస్ పెట్టారు. ‘తండేల్’ సినిమా రాబోతుండటంతో బిజీగా ఉన్న ఆయన, పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. కానీ భవిష్యత్తులో అందరికీ షాక్ ఇస్తూ రాజకీయాల్లోకి అడుగుపెడతారా? లేక పూర్తిగా సినీ నిర్మాణానికే పరిమితం అవుతారా? అన్నది వేచి చూడాలి.

‘పుష్ప’ డైలాగ్స్‌ అన్నీ ఒకే వీడియోలో.. భలే ఉందిగా ఈ పాత ట్రెండు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus