టాలీవుడ్ సెకండ్ వేవ్‌కు రెడీ అవుతోందా? అదేంటి కరోనా సెకండ్ వచ్చి చాలా రోజులైంది కదా అనుకుంటున్నారా? మేమంటున్నది కరోనా గురించి కాదు, సినిమాల గురించి. కరోనా సెకండ్ వేవ్ విరామం తర్వాత త్వరలో సినిమాల షూటింగ్‌లు మొదలుపెట్టాలని చూస్తున్నారట. వచ్చే నెల నుండి సినిమా చిత్రీకరణలకు ప్రభుత్వాలు ఓకే చెబుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో దర్శకనిర్మాతలు, హీరోలు సిద్ధమవుతున్నారట. అయితే కరోనా నేర్పిన పాఠాలు గుర్తుంచుకుంటూనే ముందుకెళ్తారట. కరోనా కోరలు బారిన పడి విలవిల్లాడిన రంగాల్లో సినిమా రంగమూ ఒకటి.
షూటింగ్ నుండి రిలీజ్ వరకూ అన్నీ ఆగిపోయాయి. సినిమా అంటే వినోదం మాత్రమే కాదు… బోలెడంత వ్యాపారం. నిర్మాత నుండి థియేటర్‌లో బైక్ స్టాండ్ మెయింటైన్ చేసేవాడి వరకూ అందరూ ఓ సినిమా నుండి వచ్చే డబ్బుతోనే జీవిస్తుంటారు. కరోనా ఫస్ట్ వేవ్ కారణంగా థియేటర్లు నెలల తరవడి బంద్ అయిపోయాయి. తీరా మొదలై… ఏదో ఓ మాదిరిగా నడుస్తోంది అనేసరికి రెండో వేవ్ వచ్చేసింది. దీంతో సినిమా మరోసారి సినిమా కష్టాలు పడింది.
కరోనా నేర్పిన గుణపాఠాలు సినిమావాళ్లకూ తెలుస్తున్నాయి. తొలివేవ్ దెబ్బకి అందుకే పెద్ద పెద్ద క్రూ తక్కువమందితో సినిమాలకు అలవాటుపడ్డారు. సినిమాకు అయ్యే ఖర్చు తగ్గించుకున్నారు. ఇప్పుడు రెండో వేవ్ దెబ్బకి ముందు తెలిసిన పాఠాలు రివైజ్ చేసుకున్నారు. ఈ క్రమంలో సినిమా హీరోలు కూడా రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నారని తెలుస్తోంది. త్వరలో సినిమాల సెకండ్ వేవ్ ప్రారంభించాలని చూస్తున్నారట. ఇప్పటికే కథలు, దర్శకులు, హీరోయిన్లు సిద్ధమైపోవడంతో వీలైనంత త్వరగా సినిమాలు ప్రారంభించడమే లక్ష్యమట.
బాలీవుడ్‌లో థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం ఆనుమతిచ్చింది. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు తెరవొచ్చు అని చెప్పింది. దీంతో మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ వరుసలోకి వస్తాయని అంటున్నారు. ఆ లెక్కన థియేటర్లు మొదలైతే జనాలు వస్తారా? అంటే మొదటి వేవ్ తర్వాత సినిమాలకు వచ్చిన రెస్పాన్సే ఇప్పుడూ నిర్మాతలకు ఆశలు రేకెత్తిస్తోంది. మంచి సినిమా పడితే జనాలు థియేటర్‌కు వస్తారనేది మొదటి వేవ్ పాఠం. అయతే చిత్రీకరణలో జాగ్రత్తలు తీసుకోకపోతే కొవిడ్ నష్టం భారీగా ఉంటుందనేది కూడా మొదటి వేవ్ పాఠమే. మరి వాటిని గుర్తుంచుకొని సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్లు ప్రారంభిస్తారట. ఆల్ ది బెస్ట్ టాలీవుడ్.