ఫ్యామిలీ చిత్రాలతో సంచలనాలు సృష్టించిన దర్శకుడు పి.చంద్రశేఖర రెడ్డి ఈ రోజు మృతి చెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు ఉదయం చెన్నై లోని ఆయన సొంత ఇంట్లో తుది శ్వాస విడిచారు.ఈయన పూర్తిపేరు పందిళ్లపల్లి చంద్రశేఖరరెడ్డి.1933 వ సంవత్సరం అక్టోబర్ 15న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, అనుమసముద్రం గ్రామంలో ఈయన జన్మించారు. పి సి రెడ్డి తండ్రి పేరు పందిళ్లపల్లి నారపరెడ్డి.. తల్లి పేరు సుబ్బమ్మ.
1959లో ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. వి.మధుసూధనరావు ఆదుర్తి సుబ్బారావు వంటి అగ్ర దర్శకుల వద్ద ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈయన దర్శకుడిగా మారి చేసిన మొదటి చిత్రం ‘అనూరాధ’.దాదాపు 75 చిత్రాలకు ఈయన దర్శకత్వం వహించారు. ఈయన తీసిన అన్ని సినిమాల్లోనూ ఫ్యామిలీ ఎమోషన్స్ నిండుగా ఉంటాయి. సూపర్ స్టార్ కృష్ణ గారికి స్టార్ డం రావడంలో ఈయన సహకారం ఎంతో ఉంది.
తర్వాత యాక్షన్ చిత్రాలను కూడా ఈయన తెరకెక్కించారు అవి భారీగా హిట్ అయినవి కావు.‘ఇల్లు-ఇల్లాలు’ చిత్రం పి సి రెడ్డి గారికి మొదటి విజయం అందించిన చిత్రం. ఆ సినిమా వల్ల స్టార్ హీరో ఎన్టీఆర్ తో ‘బడిపంతులు’ అనే చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాన్ని దక్కించుకున్నారు పి సి రెడ్డి గారు.