మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న “సైరా నరసింహారెడ్డి” చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో పాటు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం కావడంతో క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీపడటం లేదు. చారిత్రక కథ కావడంతో అప్పటి వాతావరణాన్ని ప్రతిబింబించడం కోసం సహజత్వానికి దగ్గరగా ఉన్న లొకేషన్లను ఎంచుకుని మరీ చిత్రీకరణ జరుపుతుండటంతో నిర్మాణం పూర్తి కావడానికి కాస్త ఎక్కువ సమయం పడుతోంది. దాంతో తొలుత ఆగస్టు 15న విడుదల చేయాలనుకున్న సినిమాను అక్టోబర్‌కు మార్చుకున్నారు. ఇక ఈ చిత్రం తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చిరు ఓ సినిమా చేయబోతున్నారు.
మరో ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ విషయానికి వస్తే…ఎన్.టి.ఆర్. బయోపిక్ రెండు చిత్రాలు ఆశించినంతగా ఆడకపోవడంతో ఇప్పుడాయన ఎట్టి పరిస్థితులలో సక్సెస్ సాధించే చిత్రం చేయాలన్న ఉద్దేశ్యంతో మాస్ అంశాలు పుష్కలంగా ఉండే కథాంశాన్ని ఎంచుకున్నారు. దర్శకుడు బోయపాటి, బాలకృష్ణల కాంబినేషన్‌లో లోగడ సింహా, లెజెండ్ వంటి హిట్ చిత్రాలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ మాస్ ఫార్ములాతోనే వారి కాంబినేషన్‌లో రూపొందబోయే నూతన చిత్రం ఉంటుందని అంటున్నారు. బాలకృష్ణ చేత ఎలాంటి పంచ్ డైలాగులు చెప్పిస్తే… అవి ప్రేక్షకాభిమానులను అలరిస్తాయో అన్న అంశం బోయపాటి బాగా తెలుసుకున్నారని… అందుకే వారిద్దరూ చేయబోయే నూతన చిత్రం అన్ని మసాలాలతో ఉంటుందని చెబుతున్నారు. బోయపాటి కాంబినేషన్‌లో చిత్రం త్వరలోనే పట్టాలెక్కుతుందని…ఆ తర్వాత వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో బాలకృష్ణ చేయబోయే ఆ తదుపరి చిత్రం ఉంటుందన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్టు పనులు కూడా జరుగుతున్నాయని, దానిని సి.కల్యాణ్ నిర్మిస్తారని అంటున్నారు.
ఈ వరుసలోనే అక్కినేని నాగార్జున గురించి చెప్పాలంటే…ఆఫీసర్, దేవదాస్ చిత్రాలు ఆశించినస్థాయిలో ఆడలేదు. దాంతో మంచి హిట్ చిత్రం చేయాలని నాగార్జున కంకణం కట్టుకున్నారు. తనదౖౖెన రొమాంటిక్, ఎంటర్‌టైన్‌మెంట్ ఫార్ములాతో కూడుకున్న కథాంశాన్ని ఎంచుకుని మన్మథుడు-2 చిత్రం చేస్తున్నారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చిత్రీకరణ ప్రస్తుతం పోర్చుగల్‌లో జరుగుతోంది. ఇందులో రకుల్ కథానాయికగా నటిస్తుండగా.. సమంత అతిథి పాత్రలో మెరవనుంది. మరోవైపు గతంలో సోగ్గాడే చిన్నినాయన వంటి హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రం చేయాలని నాగార్జున నిర్ణయించుకున్నారు. ఇందులో మూడుతరాలకు సంబంధించిన కథ ఉంటుందని…నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ కూడా కనిపిస్తారన్న మాటలు వినిపిస్తున్నాయి.
ఇంకో ప్రముఖ కథానాయకుడు విక్టరి వెంకటేష్ ఇప్పుడు మంచి జోష్ మీదున్నారు. గురు వంటి హిట్ చిత్రం తర్వాత ఆయన నటించిన ఎఫ్ 2 చిత్రం భారీ విజయాన్ని సాధించి..వందకోట్లకు పైగా వసూలు చేసింది. ఇక నాగచైతన్యతో కలిసి వెంకటేష్ నటిస్తున్న వెంకీమామ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం మామా అల్లుళ్ళ వినోదంతో ఆద్యంతం ప్రేక్షకులను అలరింపజేసేలా దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబి) మలుస్తున్నారట. ఈ చిత్రం తర్వాత త్రినాథరావు నక్కిన, వెంకీ అట్లూరి దర్శకత్వంలో వెంకీ తదుపరి సినిమాలు చేస్తారని…అందుకు సంబంధించిన స్క్రిప్టు పనుల్లో ఆ దర్శకులు ఉన్నారని అంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయాలని వెంకీ ఎప్పట్నంచో అనుకుంటున్నారు. అయితే ధానికి బాగా సమయం పట్టేలా ఉందంటున్నారు.