ఒక సినిమా మొదలయ్యిందంటే ఆ సినిమాకి పని చేసే దర్శకుడు మొదలుకొని, లైట్ మ్యాన్ వరకూ అందరూ సంతోషపడతారు. ఆ సినిమా షూటింగ్ సజావుగా సాగాలని వాళ్లతోపాటు వాళ్ళ కుటుంబాలు కూడా పూజలు గట్రా చేసేస్తుంటారు. ఒక సినిమా ఆగిందంటే ఆ సినిమాను నమ్ముకొని బ్రతుకుతున్న కొన్ని వందల కుటుంబాలు తిండి కోసం దిక్కులు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే.. ఎంత కష్టం వచ్చినా సినిమా మొదలైందంటే.. రెగ్యులర్ గా వచ్చే షెడ్యూల్ బ్రేకులు తప్ప సినిమా షూటింగ్ కి ఎలాంటి గ్యాప్ రాకుండా దర్శకనిర్మాతలు జాగ్రత్తపడుతుంటారు. కానీ.. గత కొన్ని రోజులుగా వరుసబెట్టి మన స్టార్ హీరోలందరూ గాయాలపాలవుతున్న కారణంగా ఏకంగా నాలుగు సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ కారణంగా నష్టపోతున్నది నిర్మాత మాత్రమే కాదు.. ఆ సినిమాను నమ్ముకొని బ్రతుకుతున్న వేలాదిమంది సినీ కార్మికులు.
తొలుత “ఆర్ ఆర్ ఆర్” యాక్షన్ సీక్వెన్స్ లో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు గాయపడడంతో సినిమా షూటింగ్ దాదాపు రెండు నెలల పాటు బ్రేక్ పడింది. ఇక రీసెంట్ గా శర్వానంద్, నాగశౌర్య, సందీప్ కిషన్ లు కూడా షూటింగ్ సమయంలో చేసిన కొన్ని స్టంట్స్ కారణంగా గాయాలపాలయ్యారు. దాంతో ఆ సినిమాలకు కూడా బ్రేక్ వచ్చింది. ఈ బ్రేక్ రావడం వలన సినీ కార్మికులు మాత్రమే కాక ఈ సినిమాను కొనుక్కోనే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా లేనిపోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి ఈ జాప్యం కారణంగా విడుదల తేదీల్లోనూ భారీ మార్పులు చోటు చేసుకొనే అవకాశం ఉంటుంది. మరి ఈ నాలుగు సినిమాల విషయంలో అలాంటి భారీ మార్పులు, నష్టాలు ఏమీ జరగవని ఆశిద్దాం. అయినా ఇలా మన ఫేవరెట్ హీరోలందరూ వరుసబెట్టి గాయాలపాలవుతుందడడం కూడా బాధగానే ఉంటుంది. వాళ్ళు ఇంకాస్త జాగ్రత్తగా ఉంటే ఇండస్ట్రీతోపాటు వాళ్ళ అభిమానులు కూడా సంతోషంగా ఉంటారు.