Tollywood: విషయం చెప్పక.. రెండోది తీయలేక.. ఇదే మన సినిమాలకు పెద్ద తలనొప్పి!

ఒక సినిమాను రెండు ముక్కలు చేయడం.. అనేది ఇప్పుడు పెద్ద సినిమాల ట్రెండ్‌గా మారింది. ‘బాహుబలి’, ‘కేజీయఫ్‌’, ‘పుష్ప’ సినిమాలను చూసి చాలా మంది దర్శక నిర్మాతలు ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. నిజానికి ‘కేజీయఫ్‌’, ‘పుష్ప’ సినిమాలు ‘బాహబలి’ని ఫాలో అయ్యాయి. అయితే ఆ తర్వాత ఈ అడుగుల్లో నడిచిన సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోవడం లేదు. రెండో పార్టు సంగతి పక్కన పెడితే తొలి పార్టే దెబ్బ తింటోంది.

Tollywood

రెండో పార్టులో ఏముండొచ్చు అని ఫ్యాన్స్‌ ఎదురుచూడటం.. అక్కడ చూస్తే అసలు విషయం లేకపోవడం ఒక సమస్య అయితే, రెండో పార్టు కోసం తొలి భాగంలో అసలు కథలో కొంత భాగాన్ని అడ్డంగా కోసేసి దాసేయడం. దీని వల్ల తొలుతదీ పోయింది, రెండోది వస్తుందో లేదో తెలియదు అనే పరిస్థితి ఏర్పడింది. దానికి తోడు తొలి పార్టులో ల్యాగ్ పెరుగుతోంది. సినిమాను రెండున్నర గంటలకు తీసుకురావడానికి అవసరం లేని, ఆసక్తి లేని సీన్స్‌ కలుపుతున్నారు.

ఇది ఏ ఒక్క సినిమానో అని కాదు. ఇటీవల కాలంలో రెండు ముక్కలాట ఆడుతూ వచ్చిన సినిమాల గురించి చెప్పేమాట. తొలి సినిమా బజ్‌ అందుకొని రెండో సినిమా తీసి, అందులో కథ లేకపోతే ఏమవుతుందో ‘ఇండియన్‌ 2’ సినిమా చూస్తే అర్థమవుతుంది. రెండో పార్టులో అసలు కథ పెట్టి తొలిపార్టును అట్టా అట్ట నడిపిస్తే ఏమవుతుందో ‘హరి హర వీరమల్లు’ చూసి చెప్పొచ్చు. ఇక ‘ఎఫ్‌ 2’కి వచ్చినంత బజ్‌, పేరు ‘ఎఫ్‌ 3’కి రాలేదు అని కచ్చితంగా చెప్పొచ్చు. రెండు పార్టులంటూ వచ్చిన ‘కింగ్డమ్‌’కి రెండో పార్టు తీయడానికి ఆసక్తి రేకెత్తించే కాన్‌ఫ్లిక్ట్‌ తొలి పార్టు ఎండింగ్‌లో లేదు. కేవలం మరిన్ని అంశాలు ఉన్నాయని మాత్రం చెప్పారు.

ఇక ‘పుష్ప 3’ సినిమా అనే హైప్‌ ఉంచడానికి ‘పుష్ప: ది రూల్‌’ సినిమా ఆఖరులో ఓ సీన్‌ పెట్టారు. అయితే ఆ సినిమా వస్తుందా? చేస్తారా? అంటే స్ట్రాంగ్‌గా యస్‌ అనే మాట వచ్చే పరిస్థితి లేదు. ఇక ‘కల్కి 2’, ‘సలార్‌ 2’, ‘దేవర 2’ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలు ఎప్పుడు మొదలవుతాయి, ఎప్పుడు వస్తాయి అనే క్లారిటీ లేదు. ఎందుకు మొదలవ్వలేదో కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో ఒక్క పార్టు కోసం పకడ్బందీగా కథ రాసుకొని తీస్తే ఫుల్‌ మీల్స్‌లా ప్రేక్షకులు ఎంజాయ్‌ చేస్తారు కదా అనే మాట వినిపిస్తోంది. ఎందుకిలా రెండు, మూడు పార్శిళ్లు.

మీ కథ వద్దు.. రీమేక్‌ చేద్దామంటున్న పవన్‌ కల్యాణ్‌.. మరో నెలలో క్లారిటీ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus