ఈ లోకంలో ఎవరి గురించి ఎవరూ పోరాడరు… ఎవరి యుద్ధం వారిదే అని చెబుతుంటారు. అయితే ఒకరి గురించి మరొకరు పోరాడుతున్నారు అంటే… కచ్చితంగా ఆ వ్యక్తి నాయకుడే అవుతాడు. అలాంటి నాయకుణ్ని తక్కువ చేస్తే, ఆయనకు సపోర్టు ఇవ్వకపోతే… ఇక ఆ ప్రజల్ని, మనుషుల్ని ఇక ఎవరూ కాపాడలేరు. ఏంటీ భారీ డైలాగ్‌లు అనుకుంటున్నారా? డైలాగ్‌లు భారీగానే ఉండొచ్చు… ఎందుకంటే విషయం అంతకంటే భారీగా ఉంది కాబట్టి. మొత్తం కథనం చదివాక… ఆ రోజు ఆ ఒక్క చిన్న పని చేసి ఉంటే ఈ సమస్య ఉండేది కాదు కదా అని మీకు కూడా అనిపిస్తుంది.
సరిగ్గా మూడు నెలల క్రితం అంటే సెప్టెంబరు 25న… సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. కార్యక్రమానికి పవన్ కల్యాణ్‌ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. పవన్ వస్తున్నాడు కాబట్టి… కచ్చితంగా పొలిటికల్ కామెంట్స్ ఉంటాయని అందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. అప్పటికే ఏపీలో టికెట్ రేట్లు, షోలు నిర్వహణ విషయంలో గరం గరం చర్చ జరుగుతోంది. అనుకున్నట్లుగానే పవన్ ప్రసంగం స్టార్ట్ చేశాడు. మధ్యలోకి వచ్చేసరికి ఏపీలో జగన్ ప్రభుత్వంపై సూటి విమర్శలు చేశాడు.
సినిమా టికెట్ ధరలు విషయంలో ఏపీ ప్రభుత్వం చూపిస్తున్న ఒంటెద్దు పోకడల్ని ఘాటుగా విమర్శించారు. దీనిపై టాలీవుడ్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని చెప్పకనే చెప్పాడు పవన్. అప్పటివరకు టికెట్ రేట్ల విషయంలో గొంతెత్తని టాలీవుడ్… పవన్ మాటలతోనైనా మూగనోము వీడుతుందేమో అనుకున్నారు. కానీ పవన్ పడ్డ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. నితిన్, కార్తికేయ లాంటి ఇద్దరు నటులు తప్ప మిగిలిన వాళ్లు స్పందించలేదు. దీంతో పవన్ ఆ సమయంలో ఒంటరివాడు అయపోయాడు.
మరోవైపు ఏపీ ప్రభుత్వం నుండి పవన్‌పై దాడి మొదలైంది. పవన్ ఎందుకు ఇలా అడుగుతున్నారు? ఆయనకే ఎందుకు ఈ కష్టం. మిగిలిన హీరోలకు సమస్య లేదా? అనే రీతిలో ప్రశ్నలు వేయడం ప్రారంభించారు. అప్పటికీ మన సినిమా వాళ్ల మనసు కరగలేదు. పవన్‌కు సపోర్టు చేయాల్సింది పోయి… ఆయన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూ ఓ కవరింగ్ డైలాగ్‌లు వదిలారు. ఏపీ ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సంధి కుదిర్చే పని చేశారు తప్ప, సినిమా పరిశ్రమ భవిష్యత్తులో పడబోయే కష్టాల గురించి పట్టించుకోలేదు. నిర్మాతల పెద్దమనిషి దిల్ రాజు అండ్ టీమ్ పవన్‌ను కలసి విషయం సద్దుమణిగేలా చేశాయి.
ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితి చూస్తే… తెలుగు సినిమాకు తెలంగాణలోను, పక్క రాష్ట్రాల్లోనూ, పక్క ఖండంలోను వసూళ్లు అద్భుతంగా వస్తున్నాయి తప్ప, ఆంధ్రప్రదేశ్‌లో కాదు. టికెట్ ధరల విషయంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడో పది, పదిహేను ఏళ్ల క్రితం నాటి లెక్కలు తీసి, వాటిని ఇప్పుడు అమలు చేస్తుండటమే. ఈ లెక్క వల్ల ఇబ్బందులు ఉన్నాయి. వెంటనే టికెట్ ధరల పెంచాల్సిందే అని సినిమా పరిశ్రమ నుండి ఎవరూ ముందుకు రాలేదు. వచ్చిన పవన్‌కు సపోర్టు చేయలేదు.
ఇప్పుడు సినిమాలు విడుదల చేసి, వసూళ్లు లేవని బాధపడుతున్నారు. ఆ రోజు పవన్ గళమెత్తినప్పుడు, ఆలోచనలు మాని పవన్‌కు సపోర్టు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేదా? ప్రభుత్వం దయాదాక్షిణ్యాల మీద ఇప్పుడు సినిమాలు విడుదల చేసి, కుంటుతూ, కుంటుతూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది. అందుకే పెద్దలు అంటారు. ఎదుర్కొనే ధైర్యం లేకపోతే, ఎదిరించేవాడి వెనుక ఉండాలి అని. వింటున్నారా సినిమా పరిశ్రమ పెద్దలూ.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!