ఆ హీరో గురించి మాట్లాడుకోవాలంటే.. ‘ఆయన వయసేంటి, ఆ ధైర్యమేంటి?’ అనే మాటలు కచ్చితంగా వినిపిస్తాయి. ఎందుకంటే ఆయన వయసు, ఫీట్లకు పొంతన కుదరదు. ఇలాంటి వాళ్లు టాలీవుడ్, బాలీవుడ్‌లో ఉన్నా హాలీవుడ్‌లో ఉన్న ఆ హీరోకు అయితే ఈ మాటలు యాప్ట్ అవుతాయి. ఎందుకంటే 63 ఏళ్లు వచ్చినా రిస్కీ షాట్‌లు, ఎవరూ ఊహించని ఫీట్లు చేస్తుంటారాయన. దానికి తగ్గట్టుగానే పారితోషికం, పేరు సంపాదించుకుంటున్నారు. మీ వేల కోట్ల రూపాయల సంపాదన వెనుక రహస్యం ఏంటి అని అడిగితే ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు.
నాలుగు దశాబ్దాలుగా టామ్ క్రూజ్ నటుడిగా చేస్తున్నారు. సాధారణ నటుడిగా జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు 600 మిలియన్ డాలర్ల ఆస్తితో అంతెత్తున ఉన్నాడు. నేనేం చేస్తున్నానన్నది ముఖ్యం కాదు. నేనెవరు అనేది అస్సలు ముఖ్యం కాదు. కొత్త కొత్త ప్రదేశాలను చూడటం, జ్ఞానాన్ని సంపాదించడం, మానవత్వం చూపించడమేనా అభిరుచులు. నాలా నేను ఉండటం వల్లే నా మిత్రులతో కలసి అన్ని పనుల్లో ముందుకెళ్తున్నాను అని టామ్ క్రూజ్ చెప్పుకొచ్చాడు.
రన్నింగ్‌లో ఉన్న విమానాలను పట్టుకుని వేలాడటం, కొండలపై నుండి దూకడం లాంటివి చేసేటప్పుడు నాకు భయం వేయదు. ఆ యాక్షన్ సీన్స్ చేయడాన్ని ఆస్వాదిస్తాను. రియల్ స్టంట్స్ చేయడం వెనుక ఎన్నో ఏళ్ల శ్రమ ఉంది. అందుకు శారీరర శిక్షణ, కొత్త టెక్నాలజీ అధ్యయనం చేయడం లాంటివి చేస్తాను. చిన్నతనం నుండి చేసే ప్రతి పని గొప్పగా ఉండేలా చూసుకున్నాను. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే నా అంతిమ లక్ష్యం అని తేల్చేశాడు టామ్ క్రూజ్.
కలలు కంటూ ఉండండి.. మీతో పాటు ఇతరులూ తమ కలలను సాకారం చేసుకునేలా సాయం చేయండి అని నమ్మే వ్యక్తిని నేను. కేవలం నా కోసం మాత్రమే జీవించను. ఇతరుల గురించి కూడా ఆలోచిస్తాను అని తన జీవిత సత్యాల్ని, లైఫ్ ఈ స్థాయికి చేరడానికి గల కారణాలను వెల్లడించాడు. అందుకే అంటారు కదా.. ఊరికనే మహానుభావులు అయిపోరు అని.