నాయకి సినిమా ఫ్లాప్ లిస్టులో చేరిపోయింది. ఈ సినిమా వల్ల త్రిషకు ఒరిగిందేం లేదు. ఆ మాటకొస్తే.. త్రిష నష్టపోయిందే ఎక్కువని చెన్నై వర్గాలు గుసగుసలాడుకొంటున్నాయి. ఈ సినిమా కోసం త్రిష పారితోషికం తీసుకోలేదట. తమిళ రైట్స్ తనకు అప్పగించమని నిర్మాతని అడిగిందట. తెలుగు, తమిళ భాషల్లో సినిమా తీస్తున్నాం కాబట్టి, తెలుగులో మంచి రేటుకు అమ్ముకొంటే లాభాలు రావడం ఖాయమని స్కెచ్ వేసిన నిర్మాత త్రిష సూచనకు అంగీకారం తెలిపాడు. అయితే ఈ సినిమాపై పాజిటీవ్ బజ్ లేకపోవడం వల్ల, విడుదల ఆలస్యం అవుతుండడం వల్ల, హారర్ కామెడీ చిత్రాల డిమాండ్ తగ్గిపోవడం వల్ల నాయకిని తమిళ జనం పట్టించుకోలేదు. రైట్స్ రూపంలో డబ్బులు బాగా వస్తాయని ఆశించిన త్రిషకు భంగపాటు తప్పలేదు.
ఈ సినిమాని తమిళంలో ఎవ్వరూ కొనకపోవడంతో… నిర్మాత సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సివచ్చిందని టాక్. దాంతో త్రిష ప్లాన్ వర్కవుట్ అవ్వలేదు. ‘ఈ సినిమాని ఎవ్వరూ కొనలేదు కాబట్టి, పారితోషికం ఇవ్వలేను’ అని నిర్మాత తేల్చి చెప్పేయడంతో త్రిష షాక్‌కి గురైంది. అందుకే… చివరి క్షణాల్లో ప్రమోషన్‌కు రాలేదని తెలుస్తోంది. మొత్తానికి నాయకి సినిమా నిర్మాతలనే కాదు, త్రిషనీ మోసం చేసింది.