మొన్నామధ్య ‘హాయ్ నాన్న’ సినిమా ప్రచారంలో అనుకుంటా… ఎవరో అభిమాని ‘మల్టీస్టారర్’ గురించి, త్రివిక్రమ్‌తో సినిమా గురించి మాట్లాడారు. దానికి నాని చాలా క్యాజువల్‌గా ‘త్రివిక్రమ్ గారూ వింటున్నారా?’ అంటూ రిప్లై ఇచ్చాడు. అప్పుడు ‘నాని అలా ఎందుకన్నాడు?’ అనే డౌట్ వచ్చింది. ఏమైనా గురూజీతో సినిమాల చేయాలనేది కోరికేమో అనుకున్నారు. అయితే ఆ రోజు నాని కావాలనే అలా అన్నాడా? ఏమో ఇప్పుడు వస్తున్న లీకులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది.
‘గుంటూరు కారం’ తర్వాత ఇమ్మీడియట్‌గా త్రివిక్రమ్ చేయబోయే సినిమా అల్లు అర్జున్‌ది కాదట. ఆ స్థానంలో ఓ మల్టీస్టారర్ సినిమా వచ్చింది. విక్టరీ వెంకటేశ్, నేచురల్ స్టార్ నాని హీరోలుగా ఓ సినిమా చేస్తున్నారని ఇండస్ట్రీ టాక్. ఈ మేరకు ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథను సిద్ధం చేశారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో సినిమాకు కొబ్బరికాయ కూడా కొట్టేస్తారు. నిర్మాతలు ఎవరు అనే డౌట్ అక్కర్లేదు. చినబాబు, సురేశ్ బాబే అవ్వొచ్చు.
వెంకటేశ్‌తో తివిక్రమ్ సినిమా ఎప్పటి నుండో చర్చల్లో వుంది. త్రివిక్రమ్ రచయితగా ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ సినిమాల్లో వెంకీ తనదైన నటన, కామెడీ టైమింగ్‌తో అలరించారు. అలాంటిది డైరక్ట్‌గా దర్శకుడిగా చేస్తే ఇంకెంత సందడి ఉంటుందో అనేది అభిమానుల ఆలోచన. ఇక నాని టైమింగ్‌కి త్రివిక్రమ్ టైమింగ్ కలిస్తే ఫన్ పీక్స్‌లో పండుతుంది అనేది మరో చర్చ. ఇప్పుడు ఈ రెండూ కలసి ఓ సినిమాగా వస్తాయి మరి.
నిజానికి బన్నీ సినిమానే త్రివిక్రమ్ నెక్స్ట్ అవ్వాలి. అయితే ‘పుష్ప’ సంగతి తేలాంటే ఇంకో ఎనిమిది నెలలు పడుతుంది. ఇక రిలీజ్ ఆ తర్వాత ప్రమోషన్స్, రెస్ట్ ఇలా అన్నీ వేసుకున్నా 2025కి కానీ బన్నీ ఫ్రీ అవ్వడు. ఈ లోపు ఆ కథ రెడీ చేసుకుంటారట త్రివిక్రమ్. మరోవైపు ఈ ఖాళీ సమయంలో వెంకీ – నాని (Nani) సినిమా పూర్తి చేసేద్దాం అనుకుంటున్నారట.