మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల ద్వారానే ఎక్కువగా మాట్లాడుతారు. వేదికలపై అరుదుగా ప్రసంగిస్తారు. ఆయన చిత్రాల్లోని డైలాగ్ల మాదిరిగానే… స్పీచ్ లు మన మనసును కడిగేస్తాయి. కొన్ని రోజుల క్రితం “అ..ఆ” విజయోత్సవంలో భాగంగా గుంటూరులో త్రివిక్రమ్ మాట్లాడుతూ .. సున్నితంగా చురకలు అంటించారు. “మనిషి గొప్పోడు. అతని కలలు గొప్పవైతే పైకి ఎక్కుతాడు. అతని అలవాట్లు, ఆశయాలు చెడ్డవైతే కిందకు పడిపోతాడు” అంటూ ప్రతి ఒక్కరూ ఉన్నతంగా ఆలోచించాలని త్రివిక్రమ్ సూచించారు.
“మనం దాదాపుగా మాట్లాడుకోవడమే మానేసాం. మనమందరం ఎక్కడో చూసుకుని మాట్లాడుతున్నాం. ఎంతో దూరంగా చూస్తూ మాట్లాడుతున్నాం. ఫోన్లోకి చూస్తూ పక్కవారికి హలో చెబుతున్నాం. టీవీ చూస్తూ భోజనం చేస్తున్నాం. ప్రపంచం బాగుండాలంటే మనం ఏమి చెయ్యనక్కరలేదు. ఇద్దరు పక్కపక్కన కూర్చొని.. ఒకరి కళ్ళల్లోకి చూసుకొని మాట్లాడుకుంటే సరిపోతుంది.” అని నేటి సమాజంలోని పరిస్థితిని వివరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ” గొప్ప పనులు చేస్తేనే బాగుంటామని కొందరు అనుకుంటారు. సరిగ్గా ఊపిరి పీలిస్తే చాలు.
ఎన్నో జబ్బులు రావు. అది చేయకుండా డబ్బులు పెట్టి సిగరెట్ కొని పొగ పీల్చి చనిపోవడానికి రెడీగా ఉంటాం. అలాగే స్వచ్చమైన మంచి నీరు తాగితే చాలు. ఆరోగ్యంగా ఉంటాం. అది చేయకుండా 60 రూపాలు పెట్టి బీరు బాటిల్ కొనుక్కొని పాడి పోతూ ఉంటాం. ప్రపంచంలో గొప్ప విషయాలన్నీ దేవుడు, అమ్మ నాన్నలు ఉచితంగా ఇచ్చేసారు. వాటిని వదిలేసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి విదేశాలకు వెళ్లి అనారోగ్యం కొని తెచ్చుకుంటామంటే దానికి ఏమి చెయ్యలేము.” అంటూ నేటి యువత తీరుపై బాణాలు సంధించారు. ఎనిమిది నిముషాలు పాటు సాగిన ఆయన ప్రసంగం ఆలోచింప జేసింది. యూ ట్యూబ్ లో ఈ వీడియోను చూసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.