ఉదయ భాను సున్నితమైన మనసు కకావికాలం అయ్యింది.. ఓ చెల్లి మరణం ఆమెను ఆవేదనకు గురిచేసింది. ఆమె శోకాన్నీ, బాధను ఓ సుదీర్ఘ సందేశం ద్వారా తెలియజేసింది. ఆమె ఆవేదన పూరిత సందేశాన్ని సోషల్ మాధ్యమాలలో చదివిన వారి హృదయం బరువెక్కిపోయింది. ఎప్పుడో ఎక్కడో పరిచయమైన ఓ అమ్మాయి మరణిస్తే సొంత చెల్లి వలే ఉదయభాను వేదనకు గురయ్యారు. రజితమ్మ అనే ఓ యువతి ఈనెల 16న అనారోగ్యంతో మరణించింది. ఆమెకు ఉదయ భానుకు అవినాభావ సంబంధం ఉంది.
2014లో ఉదయభాను నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలంలోని క్షుదా భక్షు అనే ఓ పల్లెటూరికి నిగ్గదీసి అడుగు అనే కార్యక్రమం కోసం వెళ్లారు. అది ఫ్లోరైడ్ నీటితో కూడిన ప్రాంతం కావడంతో ఆ ప్రాంత ప్రజలు అంగవైకల్యంతో పుడుతున్నారు. ఆ ప్రాంతపు శాపానికి బలి అయిన అమ్మాయే 24ఏళ్ల రజితమ్మ. ఆమెకు కూడా పుట్టుకతో తీవ్రమైన అంగవైకల్యంతో పుట్టింది. కాళ్లు చేతులు వంకరా ఉండడంతో నడవలేని పరిస్థితి ఆమెది.
ఆమె నిస్సహాయతను చూసిన ఉదయ భాను ఆర్థిక సాయం చేసి ఓ చిన్న బడ్డీ కొట్టు పెట్టించింది. దానికి కృతజ్ఞతగా రజితమ్మ ఆమె ఫోటోలు ఉదయ భానుకు పంపుతూ ఉండేదట. ప్రతి విషయాన్నీ ఉదయభానుతో పంచుకుంటూ అక్క అని పిలిచే రజితమ్మ మరణం ఆమెని బాధించింది. రజితమ్మ లాగా అనేక మంది ఆ ప్రాంతంలో ఫ్లోరైడ్ కారణంగా ప్రాణాలు కోల్పోపోతున్నారని, అంగవైకల్యంతో దుర్భరమైన జీవితం గడుపుతున్నారని ఉదయభాను ఆవేదన చెందారు. ఇది దేవుడు నిర్ణయం కాదు, కొందరు వ్యక్తుల స్వార్ధం వలన ఇలా అమాయకులు బలవుతున్నారు అని ఉదయభాను ఆక్రోశం వ్యక్తం చేశారు. పరిశ్రమల వలన కాలుష్యం పెరిగి దానితో ఇలాంటి అమాయకులు బలిఅవుతున్నారని ఉదయభాను సామాజిక సందేశంలో వెళ్లగక్కారు.