ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 30, 2020 / 10:11 AM IST

గమనిక: హాలీవుడ్ సినిమా “స్వేయర్నెట్” (Swearnet 2014)లో అత్యధికంగా 935 సార్లు F*ck అనే పదం వాడారట. అందుకుగానూ ఒక రికార్డ్ కూడా నెలకొని ఉంది. ఇప్పుడు ఈ రివ్యూలోనూ మీరు “సహజం/సహజత్వం అనే పదాన్ని ఎక్కువసార్లు చదువుతారు. అది రాసే నా తప్పు కాదు.. ఫిలిమ్ మేకర్స్ పెట్టిన శ్రద్ధ/ప్రేమ.

“కేరాఫ్ కంచరపాలెం”తో తెలుగు ప్రేక్షకులు మరియు ఇండస్ట్రీ దృష్టిని తనవైపుకు తిప్పుకొన్న దర్శకుడు వెంకటేష్ మహా. చాలా సిల్లీ రీజన్ కారణంగా నేషనల్ అవార్డ్ అందుకోలేకపోయిన వెంకటేష్ తన రెండో చిత్రంగా తెరకెక్కించిన సినిమా “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య”. మలయాళంలో ఫహాద్ నటించగా బెస్ట్ ఫీచర్ ఫిలిమ్ మరియు బెస్ట్ స్క్రీన్ ప్లేకు గానూ 2017లో నేషనల్ అవార్డ్ సైతం అందుకున్న “మహేషింటే ప్రతీకారం”కు తెలుగు రీమేక్ ఇది. “బాహుబలి” అనంతరం ఆర్కా మీడియా సంస్థ ద్వారా విడుదలైన చిత్రం కావడంతో ఈ సినిమాపై ముందు నుంచీ మంచి ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. కరోనా కారణంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..!!

కథ: అరకులో ఉన్న ఏకైక ఫోటో స్టూడియో “కోమలి ఫోటోస్టూడియో” అధినేత, సీనియర్ ఫోటోగ్రాఫర్ జి.మనోహరరావు ఒక్కగానొక్క కుమారుడు జి.ఉమామహేశ్వర్రావు అలియాస్ మహేశ్ (సత్యదేవ్). తండ్రి నుంచి వారసత్వంగా తానూ ఫోటోగ్రఫీ నేర్చుకుని చాలా సాదారణంగా జీవించేస్తుంటాడు. ఊర్లో జనాల పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు మొదలుకొని ఎవరి ఇంట్లో వేడుకైనా, ఆఖరికి చావైనా సరే ఉమామహేశ్వర్రావు కెమెరా తగిలించుకొని ప్రత్యక్షమైపోతాడు. అలాగే మహేశ్ మంచి ఫోటోగ్రాఫర్ మాత్రమే కాదు అంతకుమించిన మంచి మనిషి. కరెక్ట్ గా చెప్పాలంటే “సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమాలో రేలంగి మావయ్యకి యంగర్ వెర్షన్ లాంటి మహేశ్ కి ఒకసారి కోపం వచ్చింది. ఎంత కోపమంటే.. తనను అకారణంగా కొట్టినవాడిని తిరిగి కొట్టేవరకూ చెప్పులు వేసుకొనని శపధం చేసేంత. మరి మహేశ్ శపధం నెరవేర్చుకున్నాడా? 9 నంబర్ చెప్పులు మళ్ళీ వేసుకొన్నాడా లేదా? అనేది “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.

నటీనటుల పనితీరు: చాలా అరుదుగా సినిమాలోని ప్రతి పాత్ర నటిస్తున్నట్లు కాక వ్యవహరిస్తున్నట్లు అనిపిస్తుంది. ఆ అరుదైన చిత్రాల్లో ఒకటిగా “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య” నిలిచిపోతుంది. అసలు సత్యదేవ్ పెర్ఫార్మెన్స్ ఎంత సహజంగా ఉందంటే.. సాదారణంగా సినిమాల్లో హీరోయిన్ను లేక సినిమాలోని చిన్న పిల్లల పాత్రధారులను చూసి మురిసిపోతుంటామ్. కానీ.. “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య”లో సత్యదేవ్ ను చూసి మురిసిపోతుంటాం. మనోడి మీసకట్టు, కొట్టొచ్చినట్లు కనబడే అమాయకత్వం, బాడీ లాంగ్వేజ్ ఇలా అన్నీ చాలా సహజంగా ఉంటాయి. మలయాళ నటుడు ఫహాద్ కు ఒక ప్రత్యేకత ఉంది, అతడు కళ్ళతోనే అద్భుతమైన భావాలను పలికించగలుగుతాడు. అతడి కళ్ళు చూస్తే చాలు సన్నివేశంలోని ఎమోషన్ & ఇంటెన్సిటీ అర్ధమైపోతుంది. సత్యదేవ్ కళ్ళలో కూడా అదే మ్యాజిక్ ఉంది. బహుశా దర్శకుడు వెంకటేష్ అది చూసే సత్యదేవ్ ను ఈ సినిమా కోసం సెలక్ట్ చేసుకొని ఉంటాడు. ఈ టైటిల్ రోల్ చేయడానికి సత్యదేవ్ తప్ప మరో ఆప్షన్ లేదు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.

సత్యదేవ్ తండ్రిగా నటించిన మలయాళ సీనియర్ నటులు రాఘవన్ ను చూస్తే ఏదో తెలియని ఒక సంతృప్తి. చాలా సెటిల్డ్ గా ఉంటుంది ఆయన పాత్ర. ఆయనలోని గాంభీర్యం మన ఇంట్లో నాన్నని గుర్తుచేస్తుంది. ఆయనలా ప్రశాంతగా కూర్చుని చూస్తుంటే కూడా ఎన్నో భావాలు మదిలో మెదులుతూ ఉంటాయి చూసే ప్రేక్షకుడికి.

రూప కోడువయూర్ తెలుగు సినిమాకి దొరికిన మరో సహజమైన నటి. ఆమె కమర్షియల్ హీరోయిన్ గా కన్వర్ట్ అవ్వకుండా తన స్వచ్చమైన కళ్ళతో హావభావాలను పలికిస్తూ ఇలాగే మంచి సినిమాలు చేయాలని కోరుకుందాం. ఫ్లాష్ మాబ్ సీన్ లో ఆమె డ్యాన్స్ కి ఫిదా నేను. ఆమె కళ్లలోనే కాదు డైలాగ్ డెలివరీలోనూ మంచి మెరుపు ఉంది.

నరేశ్-సుహాస్ ల కాంబినేషన్ భలే ఉంటుంది సినిమాలో. నరేశ్ తో సమానమైన నట ప్రతిభ కనబరిచాడు సుహాస్. సుహాస్ వాయిస్ అతడి పర్సనాలిటీని డామినేట్ చేస్తున్నప్పటికీ.. బాడీ లాంగ్వేజ్ అలరిస్తుంది. విజయనగరం యాస భలే స్పష్టంగా పలికాడు. ఊరి పెద్ద పాత్రలో టి.ఎన్.ఆర్, అలాగే రాంప్రసాద్ పాత్రలు ఆకట్టుకుంటాయి.

సాంకేతికవర్గం పనితీరు: ముందుగా సంగీత దర్శకుడు బిజిబల్, సినిమాటోగ్రాఫర్ అప్పు ప్రభాకర్ గురించి మాట్లాడుకోవాలి. మలయాళ సినిమాలు చూసిన ప్రతిసారి.. కేరళలో తప్ప నేచర్ ఇంకెక్కడా లేదేమో అని కుళ్లుకునేలా ఉంటాయి వాళ్ళ సినిమాలోని ప్రకృతి సన్నివేశాలు. ఈమధ్యకాలంలో ఆ లోటును తీర్చిన సినిమా “రాజావారు రాణిగారు” ఆ సినిమాలో గోదావరి అందాలను మరింత అందంగా చూపించగా.. ఇప్పుడు “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య”లో అరకు అందాలను అద్భుతంగా ఆవిష్కరించారు. అందుకు కెమెరామేన్ అప్పు ప్రభాకర్ ను మెచ్చుకోవాల్సిందే.

దర్శకుడి ఆలోచనను తెరపై ప్రెజంట్ చేయడమే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ చూడాల్సిన అందాలు చాలా ఉన్నాయని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అలాగే మలయాళ సంగీత దర్శకుడు బిజిబల్ సంగీతం, నేపధ్య సంగీతం ఎంత సహజంగా ఉన్నాయంటే.. కెరటాల చప్పువు విన్నప్పుడు కలిగే ప్రశాంతత బిజిబల్ నేపధ్య సంగీతంలో ఉంది. పాటలు కూడా అంతే వినసోంపుగా ఉన్నాయి. పాటల్లోని సాహిత్యం కూడా మనల్ని ఆకట్టుకుంటుంది. విశ్వ సాహిత్యం అందించిన “నింగి చుట్టే”, రెహమాన్ సాహిత్యం సమకూర్చిన “ఆనందం” పాటలు వినసోంపుగానే కాదు.. అర్ధవంతంగానూ ఉన్నాయి. రవితేజ గిరిజాల ఎడిటింగ్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణను జోడించింది.

ఇప్పుడు మన డైరెక్టర్ వెంకటేష్ మహా గురించి మాట్లాడుకుందాం. సహజత్వాన్ని మించిన అందం లేదని నమ్మే అతికొద్ది మంది దర్శకుల్లో వెంకటేష్ ఒకడు. అందుకే అతడి మొదటి సినిమా “కేరాఫ్ కంచరపాలెం”తోనే ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయగలిగాడు. రెండో చిత్రంతోనూ ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయగలిగాడు వెంకటేష్. క్యాస్టింగ్ తోనే సగం విజయం అందుకున్నాడు వెంకటేష్. పాత్రకు తగ్గ నటుడ్ని వెతికిపట్టుకోవడంలోనే దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. ఆ విషయంలో ఆర్జీవీ తర్వాత స్థానం వెంకటేష్ మహాదే.

తాను ఎంచుకున్న పాత్రధారుల నుండి సన్నివేశానికి సరిపడా ఎమోషన్ ను రాబట్టుకోవడంలో విజయం సాధించాడు. అన్నిటికంటే ఒరిజినల్ కథ, సినిమాలోని ఆత్మను మిస్ అవ్వలేదు. మలయాళ వెర్షన్ చూసిన ప్రేక్షకుడిని, చూడని ప్రేక్షకుడిని కూడా సంతృప్తిపరిచాడు వెంకటేష్. రీమేక్ కదా అని మరీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ దించేయలేదు. తన మార్క్ ఉండేలా జాగ్రత్తపడ్డాడు. నేటివిటీకి తగ్గట్లు బోలెడన్ని మార్పులు చేశాడు. సొ, వెంకటేష్ మహా కూడా సక్సెస్ ఫుల్ గా సెకండ్ సినిమా సిండ్రోమ్ నుంచి బయటపడ్డాడు. దానికి కారణం అతడు నమ్మిన సహజ సిద్ధాంతం. ఈ సహజ సినిమా జెండాను వెంకటేష్ మరికొంతకాలం ఇలాగే ఎగురవేస్తాడని ఆశిస్తున్నాను.

విశ్లేషణ: ఒక సినిమా చూస్తున్నప్పుడు కథతోనో లేక పాత్రలతోనో జర్నీ చేస్తుంటాం. కానీ.. “ఉమామహేశ్వర ఉగ్రరూపస్య”లో టైటిల్ పాత్రధారి కోపంతో జర్నీ చేస్తాం. మొండోడి కోపం వాడికి చేటు.. మంచోడి కోపం ఊరికి చేటు అన్నట్లుగా ఒక మంచోడికి కోపం వస్తే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న పాయింట్ తో తీసిన సహజమైన మంచి సినిమా ఇది. సొ, ఎలాంటి అంచనాలు లేకుండా కుటుంబంతో కలిసి సరదాగా చూసి ఆస్వాదించండి.


రేటింగ్: 3/5

ప్లాట్ ఫార్మ్: నెట్ ఫ్లిక్స్

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus