నటరత్న ఎన్టీఆర్, నటభూషణ శోభన్ బాబు, చంద్రకళ, కళాభినేత్రి వాణిశ్రీ, కృష్ణ కుమారి, రేలంగి, హరనాథ్, నాగభూషణం తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా.. ‘ఆడపడుచు’.. సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ మీద కె. హేమాంబరధరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. టి.ఎస్. నటరాజన్ కథ, ఎల్.వి. ప్రసాద్ స్క్రీన్‌ప్లే, కె. ప్రత్యగాత్మ మాటలు అందించారు. 1967 నవంబర్ 30న విడుదలైన ఈ చిత్రం 2022 నవంబర్ 30 నాటికి 55 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.
సత్యం (ఎన్టీఆర్), చెల్లి శారద (చంద్రకళ), తమ్ముడు శేఖర్ (శోభన్ బాబు) లతో కలిసి హాయిగా జీవిస్తుంటాడు. స్కూల్ టీచర్ సుశీల (కృష్ణ కుమారి) ని ప్రేమిస్తాడు. చెల్లాయి, తమ్ముడి పెళ్లిళ్లు చేశాకే తను వివాహం చేసుకోవాలనుకుంటాడు. అదృష్టం కొద్దీ శారదకి డాక్టర్ రమేష్ (హరనాథ్) తో పెళ్లి నిశ్చయం అవుతుంది. శేఖర్, జమీందారు రావు బహదూర్ రంగారావు (నాగభూషణం) కూతురు లలిత (వాణిశ్రీ) ని చేసుకోవాలనుకుంటాడు. అనుకోకుండా ఓ ప్రమాదంలో శారద కంటి చూపు కోల్పోతుంది. తర్వాత శేఖర్, లలితల పెళ్లి జరుగుతుంది. అక్కడి నుండి సత్యం, చెల్లి శారదల జీవితాల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనే భావోద్వేగభరితమైన అంశాలతో ‘ఆడపడుచు’ తెరకెక్కింది..
సెంటిమెంట్ పండింది..
ఎన్టీఆర్, చంద్రకళ సెంటిమెంట్‌కి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఎమోషనల్ సీన్లలో కంటతడి పెట్టారు. టి. చలపతి రావు కంపోజ్ చేసిన పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. దాశరథి, ఆరుద్ర, సినారె, కొసరాజు, శ్రీ శ్రీ అద్భుతమైన పాటలు రాయగా.. మాధవపెద్ది సత్యం, ఘంటసాల, పి.సుశీల, బి.వసంత, జయదేవ్ అంతే చక్కగా పాడారు. ముఖ్యంగా పి.సుశీల పాడిన ‘అన్నా నీ అనురాగం.. ఎన్నో జన్మల పుణ్యఫలం’ పాట అందర్నీ ఆకట్టుకుంది..
ఐదు సెంటర్లలో శతదినోత్సవం..
అశేష ప్రేక్షకాదరణతో.. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల ఆశీస్సులతో గుంటూరు, విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, విశాఖపట్నం లాంటి పట్టణాల్లో శతదినోత్సవం జరుపుకుంది.. అన్నాచెల్లెల్ల సెంటిమెంట్‌తో వచ్చిన ‘ఆడపడుచు’ నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తెచ్చిపెట్టింది.. 1952లో తమిళనాట ఎమ్జీఆర్ హీరోగా తెరకెక్కిన ‘ఎన్ తంగై’ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. హిందీలో ‘ఛోటీ బెహన్’ (1959), కన్నడలో ‘ఒండే బల్లియా హూగలు’ (1967 జనవరి 20) పేర్లతో రీమేక్ అయిన తర్వాత చివరిగా తెలుగులో తెరకెక్కడం విశేషం..