బయటకు చూపించేదంతా నిజం కాదు.. మనసు లోపల వేరే ఉంటుంది.. ఈ మాటకు మీకు నిలువెత్తు నిదర్శనం కావాలి అంటే ఈ రోజు వందో పుట్టిన రోజు జరుపుకుంటున్న ప్రముఖ నటి, దివంగత సూర్యకాంతం (Suryakantham) ఫొటోను చూస్తే సరి. దివంగత అంటున్నారు, పుట్టిన రోజు అంటున్నారు ఏంటి అని అనుకుంటున్నారా? నిజానికి ఈ రోజు ఆమె వందో జయంతే కానీ.. ఆమె తన పాత్రలతో ఇన్నేళ్లయినా మన మధ్యనే ఉన్నారు. అందుకే ‘సూర్యకాంతం లివ్స్ ఆన్’ అని అనుకుంటూ ఓసారి ఆమె గురించి గుర్తు చేసుకుందాం.
సినిమాల్లో గడసరి అత్త అనే పాత్ర ఒకప్పుడు రచయితలకు, దర్శకులకు గుర్తొచ్చే పేర్లలో సూర్యకాంతం తొలి స్థానంలో ఉంటుంది. అలా తన పాత్రల్లో జీవించేశారామె. ఆమె కోడలిని తిట్టినా, భర్తను గదమాయించినా, కొడుకు దగ్గర మొసలి కన్నీళ్లు పెట్టినా ఆమెకే చెల్లింది. అందుకే ఒకే లాంటి పాత్రలు ఎన్ని సినిమాల్లో చేసినా ఆమెను అంతగానే ఆదరించారు. ఆమె మాటల్లో గోదారోళ్ల వెటకారం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అదే ఆమె నటనకు అదనపు అందం కూడా. సూర్యకాంతం కాకినాడ దగ్గరలోని వెంకటకృష్ణరాయపురంలో అక్టోబరు 28, 1924న జన్మించారు.
చిన్నతనంలో తండ్రిని కోల్పోవడంతో కాకినాడలోని అక్క శేషమ్మ దగ్గర పెరిగారు. అక్కడే నాట్యం నేర్చుకున్నారు. అయితే సినిమాలు చూడమన్నా, డిటెక్టివ్ నవలలు చదవడమన్నా ఇష్టం. ఆమె ధైర్యం గురించి చెప్పాలంటే.. కాకినాడలో జరిగిన పురుషుల సైకిల్ రేసులో సూర్యకాంతం పోటీపడి విజేతగా నిలవడం గురించి గుర్తు చేసుకోవాలి అంటారు అప్పటి ప్రేక్షకులు. సినిమాల్లోకి వచ్చాక, గయ్యాళి పాత్రలతో మెప్పించాక కొంతమంది ఆమె దగ్గరకు వచ్చి.. గయ్యాళి పాత్రలతో మీకు ఇబ్బంది లేదా?
అని అడిగితే నేను గయ్యాళిగా వేయబట్టే మిగతా పాత్రలు అంత మంచిగా వస్తున్నాయి అని నవ్వేశారట. అంతలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారు ఆమె. సాయం చేయడంలో ఆమెది పెద్ద చేయి అని అంటుంటారు. అలా దివిసీమ తుపాను సమయంలో ఎన్టీఆర్ (Sr NTR), ఏఎన్‌ఆర్‌తో (Akkineni Nageswara Rao) కలసి ఇంటింటికి తిరిగి జోలె పట్టి విరాళాలు సేకరించారు. ఇక అసలు విషయానికొస్తే.. ఆమె తొలుత చిన్న పాత్రల్లో మెప్పించినా, ‘సౌధామిని’ అనే సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు. అయితే అదే సమయంలో కారు ప్రమాదం జరిగి ముఖానికి గాయం కావడంతో ఆ ఛాన్స్ పోయింది. ఇదే కాదు ఆమె గురించి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద చరిత్రే ఉంది.