అప్పట్లో పూరి జగన్నాథ్ (Puri Jagannadh) సినిమాల టైటిల్స్ ఎంత డిఫరెంట్ గా ఉండేవో.. ఆ సినిమాల కథలు కూడా అంతే డిఫరెంట్ గా ఉండేవి. రెగ్యులర్ గా సినిమాలు చేయడం ఆయనకు నచ్చదు. కడుపు కాలినప్పుడు రాసే కథలు గొప్పగా ఉంటాయి అనేది పూరి నమ్మకం. దర్శకుడిగా అవకాశం వచ్చినప్పటికీ, తినడానికి అన్ని రకాల రుచులు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా.. కృష్ణానగర్ లో పడిన కష్టాలు మర్చిపోకూడదు అని భావించి… తినడం మానేసి మరీ కథలు డెవలప్ చేసేవారట పూరి.
ఆయన తీసిన బ్లాక్ బస్టర్ సినిమాలు అన్నీ ఆయన కష్టంలో నుండి పుట్టుకొచ్చినవే. అలాంటి వాటిలో ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ (Itlu Sravani Subramanyam) ఒకటి. 2001 సెప్టెంబర్ 14 న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 23 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ సినిమా కథ చాలా మంది హీరోలకి పూరీ వినిపించడం జరిగిందట. కానీ ఎవ్వరూ అంగీకరించలేదు. ఎందుకంటే దీని కథ కూడా అలాగే ఉంటుంది. ‘ఉద్యోగం దొరక్క ఆత్మహత్య చేసుకోవాలనుకునే ఓ కుర్రాడు..
ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటారు.ఓ కొండ మీద నుండి దూకి ప్రాణాలు తీసుకోవాలని భావించినప్పటికీ.. వీరికి ధైర్యం సరిపోదు. దీంతో నిద్రమాత్రలు మింగి ప్రాణాలు తీసుకోవాలి అనుకుంటారు. ఆ ప్రాసెస్ లో ఇద్దరూ ప్రేమలో పడతారు. అయితే వీళ్ళు ప్రాణాలతో బయటపడిన తర్వాత.. ఒకరి ఆచూకీ ఇంకొకరికి దొరకదు. తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ?’.
హీరోలెవరూ ఒప్పుకోకపోవడంతో తన స్నేహితుడు రవితేజని (Ravi Teja) పెట్టి.. సినిమా తీసేశాడు పూరీ. సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ సినిమాతో హీరోగా రవితేజ నిలదొక్కుకున్నాడు. 32 కేంద్రాల్లో యాభై రోజులు, 18 కేంద్రాల్లో వంద రోజులు ఆడింది ఈ సినిమా. ఎస్.వి.సెల్యులాయిడ్ బ్యానర్ పై శేషు రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.వాళ్లకి మంచి లాభాలు వచ్చాయి. హీరోయిన్ తనూరాయ్ (Tanu Roy) ఇంకొన్ని సినిమాలు చేసుకోగలిగింది. ప్రేమ కథా చిత్రాలకి సరికొత్త డెఫినిషన్ చెప్పింది ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’.