నటభూషణ శోభన్ బాబు నట జీవితంలో ఎన్నో మరపురాని చిత్రాలున్నాయి.. పౌరాణిక, సాంఘిక సినిమాలతో సంచలన విజయాలు సాధించారాయన.. తర్వాత కుటుంబ కథా చిత్రాలు.. ముఖ్యంగా ఇద్దరు కథానాయికలతో ఆయన చేసిన సినిమాలు ప్రేక్షకాభిమానులను విపరీతంగా అలరించాయి.. కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు.. వీరిద్దరి కలయికలో వచ్చిన సందేశాత్మక చిత్రం ‘కాలం మారింది’.. 1972 డిసెంబర్ న విడుదలైంది. 2022 డిసెంబర్ 1 నాటికి విజయవంతంగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటోంది.
ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.. శోభన్ బాబు, గుమ్మడి, శారద, అంజలీ దేవి, సూర్యకాంతం, రావుగోపాల రావు, చంద్రమోహన్, సాక్షి రంగారావు తదితరులు ప్రధాన తారాగణంగా.. కె. విశ్వనాథ్ దర్శకత్వంలో.. వాసిరాజు ప్రకాశం (సీనియర్ పాత్రికేయులు), బి. హనుమంతరావు నిర్మించారు. సాలూరి రాజేశ్వర రావు సంగీతమందించగా.. పి. సుశీల, ఘంటసాల పాడారు. అశోక్ కుమార్ కెమెరా, కె. సత్యం ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. అప్పట్లో సంచలనం సృష్టించిందీ చిత్రం..
అంటరానితనం, కుల నిర్మూలన ఈ చిత్రంలోని ప్రధాన ఇతివృత్తం.. ఇలాంటి లక్షణాలనే కోరుకున్న మహాత్మా గాంధీకి ‘కాలం మారింది’ చిత్రాన్ని అంకితమిచ్చారు. సమాజంలో వేళ్లూనుకుపోయిన అంటరానితనం, కుల, జాతి వివక్ష వంటి వాటి గురించి సందేశాత్మకంగా చూపిస్తూ.. ఓ కనువిప్పుగా, పండిత పామరులకు సైతం అర్థమయ్యే విధంగా సినిమాను తెరకెెక్కించారు దర్శకుడు కె. విశ్వనాథ్.. ఆయన దర్శకత్వ ప్రతిభకు అద్దం పడుతుందీ చిత్రం.. నటీనటుల నటన, సాంకేతికనిపుణుల పనితీరుకి ప్రశంసలు లభించాయి..
‘నిజం తెలుసుకోండి ఓ యువకుల్లారా’ అంటూ సాగే దేశ భక్తి గీతం యువతరాన్ని, భావి భారత పౌరుల్ని ఉత్తేజపరుస్తుంది.. సినిమాలో భగవద్గీతలోని ఘంటసాల పద్యాలను కూడా వాడారు. ఈ చిత్రానికిగానూ నిర్మాత వాసిరాజు ప్రకాశం బంగారు నందిని అందుకున్నారు. ప్రేక్షకాభిమానులను విశేషంగా అలరించిన ‘కాలం మారింది’ విడుదలైన అన్ని ముఖ్య కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుని.. నిర్మాతలకు అవార్డులు, రివార్డులతో పాటు అత్యధిక లాభాలను కూడా తెచ్చిపెట్టింది..