ఎం.ఎం.కీరవాణి (Keeravani) తండ్రి శివశక్తి దత్తా మరణవార్త టాలీవుడ్ ను కుదిపేసింది. నిన్న రాత్రి మణికొండలో ఉన్న ఆయన సొంత ఇంట్లో శివశక్తి దత్తా (Shiva Shakti Datta) కన్నుమూశారు. ఆయన వయసు 92 ఏళ్ళు. ఈయన చనిపోయే టైంకి కీరవాణి విదేశాల్లో ఉన్నారు. అందుకే ఈరోజు మధ్యాహ్నం వరకు భౌతిక కాయాన్ని శివశక్తి దత్తా నివాసం వద్ద ఉంచినట్టు తెలుస్తుంది. శివశక్తి దత్తా మరణానికి చింతిస్తూ టాలీవుడ్ పెద్దలైన చిరంజీవి వంటి వారు ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేస్తున్న మహేష్ బాబు ప్రత్యేకంగా వెళ్లి శివశక్తి దత్తా భౌతిక కాయానికి నివాళులు అర్పించడం జరిగింది.
చాలా మంది శివశక్తి దత్తా ఎం.ఎం.కీరవాణి (Keeravani) కొడుకు మాత్రమే అనుకుంటున్నారు. కానీ చాలా సూపర్ హిట్ సినిమాలకి ఆయన పనిచేశారు అనే విషయం చాలా మందికి తెలీదు. ఇప్పుడు ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం రండి :
1) శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు. ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి దగ్గర కొవ్వూరు ఆయన సొంత ఊరు. 1932 అక్టోబర్ 8న జన్మించారు. విద్యాబ్యాసం కూడా అక్కడే జరిగింది.
2) ఏలూరు సి.ఆర్. రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు శివశక్తి దత్తా. కానీ ఆ తర్వాత ఆయన చదువు మధ్యలోనే చదువు ఆపేసి కళల వైపు ఉన్న మక్కువతో ఇంటి నుండి పారిపోయారు. అలా ముంబైకి వెళ్లిన ఆయన… సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ కళాశాలలో ఆయన పెయింటింగ్స్, సాహిత్యం వంటి వాటిలో శిక్షణ పొందారు.
3) ‘కమలేష్’ అనే పేరుతో ఆయన పై ఎన్నో నవలలు రాశారు. ఈ క్రమంలో సుబ్బారావుగా ఉన్న ఆయన పేరును శివశక్తి దత్తాగా మార్చుకోవడం జరిగింది. సంగీతం పట్ల ఆయనకి ఆసక్తి ఎక్కువగా ఉండేది. గిటార్, సితార్, హార్మోనియం వంటి వాటిలో కూడా ఆయన శిక్షణ పొంది సంగీతంపై ఉన్న తన ఆసక్తిని చాటుకున్నారు.
4) తర్వాత సినిమాల్లో కూడా అడుగుపెట్టారు. చెన్నై మద్రాసుగా ఉన్న రోజుల్లో సినిమాల్లో పలు సినిమాలకు కో రైటర్ గా అవకాశాలు పొందారు.
5) ‘పిల్లన గ్రోవి’ అనే సినిమాను దర్శకుడిగా ప్రారంభించారు. రాజమౌళి తండ్రి అలాగే శివశక్తి దత్తా సోదరుడు కె.విజయేంద్ర ప్రసాద్ దీనికి కథ అందించడంతో పాటు నిర్మాతగా కూడా మారడం జరిగింది. కానీ ఈ సినిమా ఆర్థిక లావాదేవీల కారణంగా ఆగిపోయింది. కొన్నాళ్ళు ఫైనాన్సియర్ల కోసం ప్రయత్నించారు. తర్వాత డబ్బు పెట్టే నిర్మాత రాకపోవడంతో పూర్తిగా ఈ ప్రాజెక్టుని వదిలేశారు.
6) ‘పిల్లన గ్రోవి’ గురించి ఇంకో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అదే ఇందులో హీరో గురించి. అవును ‘పిల్లన గ్రోవి’ లో హీరోగా నటించింది మరెవరో కాదు ఎస్.ఎస్.రాజమౌళి. చాలా మందికి ఈ విషయం షాకింగ్ గా అనిపించవచ్చు. కానీ ఇది నిజం.రాజమౌళిని హీరోని చేయాలని అన్నదమ్ములైన విజయేంద్రప్రసాద్, శివశక్తి దత్తా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నం ఫలించలేదు.
7) దీంతో మళ్ళీ రచయితగా సినిమాల్లో పనిచేసేవారు. ఇదే క్రమంలో కె.రాఘవేంద్రరావుతో శివశక్తి దత్తాకు పరిచయం ఏర్పడింది. ‘జానకి రాముడు’ అనే సినిమాకి శివశక్తి దత్తా రైటర్ గా పనిచేశారు. అది పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది.
8) ‘సై’ ‘ఛత్రపతి’ ‘రాజన్న’ ‘బాహుబలి’ ‘ఆర్ఆర్ఆర్’ ‘జాంబీ రెడ్డి’ ‘హనుమాన్’ వంటి సూపర్ హిట్ సినిమాలకి సాహిత్య రచయితగా పనిచేశారు శివశక్తి దత్తా. ‘ఛత్రపతి’ లో ‘అగ్ని స్కలన’ అనే గూజ్ బంప్స్ సాంగ్ ని రాసింది ఈయనే. ఇంకా ఎన్నో చార్ట్ బస్టర్ సాంగ్స్ రాశారు.
9) దర్శకుడిగా కూడా శివశక్తి దత్తా ఓ సినిమా చేశారు. అదే ‘చంద్రహాస్’. 2007లో ఈ సినిమా వచ్చింది. హరినాథ్ పొలిచర్ల హీరోగా నటించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది.
10) శివశక్తి దత్తా కుటుంబం గురించి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈయనకు ఇద్దరు కుమారులు. ఒకరు ఎం.ఎం.కీరవాణి, మరొకరు కల్యాణి మాలిక్. కీరవాణి ఆస్కార్ రేంజ్ కి వెళ్ళారు. కానీ కల్యాణి మాలిక్ ఓ మంచి మ్యూజిక్ డైరెక్టర్ గా మిగిలిపోయారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ శివశక్తి దత్తా సోదరుడు.