టాలీవుడ్లో ఫ్రెండ్ క్యారెక్టర్లు వేసి పాపులర్ అయిన వారిలో రవి వర్మ కూడా ఒకడు. కానీ ఇతని పేరు చెబితే టక్కున ఎవ్వరూ గుర్తుపట్టరు. అంతలా ఈయన్ని ఓ మూలకు పడేసి ఉంచుతారు. డైలాగులున్నా సరే ఇతను చేసే పాత్రలకు అంతంతమాత్రమే గుర్తింపు లభిస్తుంది. రవివర్మ ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను పెరిగింది అంతా హైదరాబాద్లోనే.సీబీఐటీ కాలేజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. తర్వాత అమెరికాలో మాస్టర్స్ చేశాడు.
2005 లో దేవకట్టా డైరెక్షన్లో వచ్చిన ‘వెన్నెల’ తో ఇతను నటుడిగా పరిచయమయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘రాఖీ’ చిత్రం ఇతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ చెల్లెలి భర్త పాత్రలో ఇతను నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రను పోషించాడు.ఆ పాత్ర బాగా క్లిక్ అవ్వడంతో అటు తర్వాత వరుసగా ‘బొమ్మరిల్లు’ ‘రెడీ’ ‘జల్సా’ ‘శ్రీమంతుడు’ ‘క్షణం’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ‘ఘాజీ’ ‘టాక్సీవాలా’ వంటి చిత్రాల్లో ఇతను నటించి బాగా పాపులర్ అయ్యాడు.
ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూనే వెబ్ సిరీస్ లలో కూడా కనిపిస్తున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవివర్మ కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. ‘ ‘రాఖీ’ సినిమాలో నటించడం వల్ల పదేళ్ల తర్వాత కూడా నన్ను గుర్తుపడుతున్నారు అంటే ఆ సినిమాలో నా పాత్ర జనాలకు ఎంతలా రిజిస్టర్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. నేను చేసిన నెగిటివ్ రోల్స్ అన్నీ కూడా బాగా పాపులర్ అయ్యాయి.
ఆ టైంలో చేసిన సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యాయి కానీ.. అటు తర్వాత 5 ఏళ్ళు నేను సినిమాల్లో లేను. ఈ సంగతి ఎక్కువ మందికి తెలీదు. అటు తర్వాత ‘శ్రీమంతుడు’ ‘అసుర’ వంటి సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. నేను అమెరికాలో జాబ్ చేసుకుంటే.. లక్షల్లో జీతం వచ్చేది. కానీ ఇప్పుడు సినిమాల్లో రాణిస్తున్నాను అంటే అది నా కుటుంబం ఇచ్చిన సపోర్ట్ వల్లే’ అంటూ రవివర్మ చెప్పుకొచ్చాడు.