అక్కినేని నాగార్జున డబుల్ రోల్ ప్లే చేసిన సినిమాల్లో ది బెస్ట్ అనిపించిన మూవీ ‘హలో బ్రదర్’ అనడంలో సందేహం లేదు. ‘శ్రీ దుర్గా ఆర్ట్స్’ బ్యానర్ పై కె.ఎల్.నారాయణ నిర్మించిన ఈ మూవీకి ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి రాజ్ కోటి సంగీతం అందించారు. 1994 వ సంవత్సరం ఏప్రిల్ 20న ఈ మూవీ విడుదలైంది. ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయ్యింది. నేటితో ఈ మూవీ విడుదలై 28 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి :
1)’హలో బ్రదర్’ చిత్రం హాంకాంగ్ యాక్షన్ కామెడీ డ్రామా అయిన ‘ట్విన్ డ్రాగన్స్’ స్పూర్తితో రూపొందింది. అయితే దీని సోల్ ను మాత్రమే తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఇవివి గారు స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు.
2) ఈ మూవీ కంటే ముందు నాగార్జునతో ఇవివి గారు ‘వారసుడు’ అనే మూవీ చేసారు. ఆ మూవీ కూడా మంచి హిట్ అయ్యింది. కాకపోతే కొంత క్రెడిట్ సూపర్ స్టార్ కృష్ణ గారి అకౌంట్లో పడిపోయింది. ఇక నాగార్జునతో రెండో మూవీ అనుకున్నప్పుడు మొదట ‘హలో బ్రదర్’ ను అనుకోలేదట ఈవివి గారు.
3) మంచి లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా చేద్దామనుకున్నారు. కానీ నాగార్జున అప్పటికి లవ్ స్టోరీలు చాలా చేసారు. ఇవివి గారు అంటే ఎలాగూ కామెడీకి బ్రాండ్. ఆల్రెడీ వీళ్ళ కాంబోలో యాక్షన్ మూవీ వచ్చింది. కాబట్టి ఐడెంటికల్ ట్విన్స్ కాన్సెప్ట్ తో చేయాలని డిసైడ్ అయ్యారు.
4) అప్పటివరకు రాజేంద్ర ప్రసాద్ తో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన ఈవివి గారికి.. మొదటి అవకాశం ఇచ్చిన స్టార్ హీరో నాగార్జున. ఆయనతో సినిమా చేసేప్పుడు చాలా జాగ్రత్త పడాలి. హీరో కవలలుగా పుట్టడం, పుట్టిన వెంటనే వాళ్ళు వేరుబడడం. ఒకరు గొప్ప వారుగా మరొకరు పేదవారుగా లేదా క్రిమినల్ గా పుట్టడం వంటిది చాలా పాత ఐడియా.
5) పైగా ఈ మూవీకి రెండు, మూడేళ్ళ ముందు మెగాస్టార్ చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ చిత్రం వచ్చింది. అది కూడా ఇంచుమించు అలాంటి కథే. దాంతో ‘హలో బ్రదర్’ ప్రాజెక్టు చర్చల దశలో ఉండగా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి.
6) రాజేంద్ర ప్రసాద్ తో సినిమాలు చేస్తూ కాలం గడుపుతున్న ఇవివి గారికి ‘వారసుడు’ అవకాశం వచ్చింది. కానీ అందులో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి ఓకె. బాక్సాఫీస్ వద్ద నడిచిపోయింది. కానీ నాగార్జున ఒక్కరితోనే ఈ ప్రయోగం అంటే ఆయనకి డిజాస్టర్ పక్కా అని అంతా కామెంట్లు చేసారు.
7) ఇండస్ట్రీలో చాలా మంది నాగార్జునకి ఫోన్ చేసి దయచేసి ఈ ప్రాజెక్టుని పక్కన పెట్టామన్నారు. నాగ్ తండ్రి ఏఎన్నార్ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారు. కానీ నాగార్జునలో ఏదో తెలీని కాన్ఫిడెన్స్ అలా ముందుకు నడిపించింది.
8) చాలా అనుమానాల మధ్య సినిమా రిలీజ్ అయ్యింది. ఫస్ట్ సీన్ దగ్గరనుండీ లాస్ట్ సీన్ వరకు జనాలు ఈలలు గోలలతో సినిమాని చూసారు.
9) నాగార్జున డబుల్ రోల్ చాలా బాగా ప్లే చేసాడు. కామెడీతో పాటు ఇంటర్వెల్ వద్ద వచ్చే మాస్ ఫైట్, రమ్యకృష్ణతో లవ్ ట్రాక్, రొమాంటిక్ సాంగ్స్, మాస్ సాంగ్స్ లతో కలిపి ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని పంచిన మూవీ ఇది.
10) నాగార్జునకి డూప్ గా శ్రీకాంత్ నటించారు. ఇవివి గారికి ప్రియమైన శిష్యుడు శ్రీకాంత్. కాబట్టి డూప్ గా చేయడానికి వెంటనే ఒప్పుకున్నాడు.
11)ఎల్.బి.శ్రీరామ్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాసారు. అవి ఓ రేంజ్లో పేలాయి. ఇప్పుడు చూసినా ఆ డైలాగ్స్ మనకి చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి.
12) రాజ్ కోటి సంగీతంలో రూపొందిన పాటలు ‘ప్రియరాగాలే’ ‘కన్నెపెట్టరో కన్నుకొట్టరో’ వంటి పాటలు ఆ టైములో ఎక్కడ చూసినా మార్మోగి పోయాయి
13)’హలో బ్రదర్’ తర్వాత ఇవివి గారి దశ తిరిగిపోయింది. చిరంజీవి తో ‘అల్లుడా మజాకా’, వెంకటేష్ తో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, అబ్బాయిగారు, బాలకృష్ణతో గొప్పింటి అల్లుడు వంటి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
14) ‘హలో బ్రదర్’ తర్వాత నిర్మాత కె.యల్.నారాయణ నాగార్జునతో సంతోషం అనే చిత్రాన్ని కూడా చేసి సూపర్ హిట్ అందుకున్నారు.
15)ఇక ‘హలో బ్రదర్’ నిర్మాత కె.ఎల్.నారాయణ త్వరలో మహేష్ బాబుతో ఓ సినిమా నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.