ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

మెగా కాంపౌండ్ ను వచ్చిన మరో కథానాయకుడు పంజా వైష్ణవ్ తేజ్. సుకుమార్ వద్ద పలు చిత్రాలకు వర్క్ చేసిన బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం పాటల పుణ్యమా అని జనాలకి బాగా చేరువైంది. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలన్నీ సూపర్ సక్సెస్ ఫుల్ అయ్యాయి. ఇక హీరోయిన్ కృతిశెట్టికి సినిమా రిలీజ్ కి ముందే భీభత్సమైన ఫ్యాన్ బేస్ క్రియేట్ అవ్వడం సినిమాకి ప్లస్ పాయింట్. భారీ స్థాయి అంచనాలు లేకపోయినా, మంచి ఎక్స్ పెక్టేషన్స్ నడుమ విడుదలవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? హీరోగా వైష్ణవ్ తేజ్ తనను తాను ప్రూవ్ చేసుకున్నాడా? అనేది చూద్దాం..!!


కథ: సముద్రంలో చేపలు పట్టుకొని బ్రతికే జాలరి జాలయ్య కొడుకు ఆశి (వైష్ణవ్ తేజ్), ఆ సముద్రాన్ని కైవసం చేసుకొని ఫిష్ హార్బర్ కట్టాలనుకొనే ఊరిపెద్ద రాయనం (విజయ్ సేతుపతి) కూతురు కోటగిరి సంగీత అలియాస్ బేబమ్మ (కృతి శెట్టి) కులం-జాతి విభేధాలను పట్టించుకోకుండా ప్రేమించుకుంటారు. ఈ కులాంతర ప్రేమకు ఎప్పట్లానే హీరోయిన్ ఫాదర్ అయిన మన రాయనం ఎలా అడ్డుపడ్డాడు? ఈ ప్రేమకథకు ముఖ్యమైన అడ్డంకి ఏమిటి? చివరికి ఏం జరిగింది? అనేది “ఉప్పెన” కథాంశం.

నటీనటుల పనితీరు: వైష్ణవ్ తేజ్ నటుడిగా పర్వాలేదనిపించుకున్నాడు. నుదురు, కంటిచూపు చిరంజీవిని గుర్తుచేయడం వైష్ణవ్ తేజ్ కి పెద్ద ఎస్సెట్. అయితే.. హావభావాల ప్రదర్శనలో మాత్రం చాలా డెవలప్ అవ్వాల్సి ఉంది. మెగా కాంపౌండ్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి, నటనలో కాస్త పరిణితి చెందితే వైష్ణవ్ హీరోగా స్థిరపడడానికి పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. హీరోయిన్ కృతిశెట్టి ఆల్రెడీ తన క్యూట్ నెస్ తో యూత్ ఆడియన్స్ కు బాగా చేరువైంది. అమ్మాయి అందంగా ఉంది, ఒద్దికగా ఉంది. అయితే.. నటన పరంగా మాత్రం ఓనమాల దగ్గరే ఆగిపోయింది. విజయ్ సేతుపతి లాంటి నట దిగ్గజం ముందు నిలబడడానికి భయపడిందో ఏమో కానీ చాలా కీలకమైన సన్నివేశాల్లో మిన్నకుండిపోయింది.

నేటి తరం నటదగ్గజమైన విజయ్ సేతుపతి ఈ చిత్రంలో ఓ సాధారణ విలన్ లా కనిపించడానికి పెద్దగా కష్టపడలేదు. అయితే.. ఆయనకి పెట్టుడు మీసం, సింక్ అవ్వని డబ్బింగ్ పెద్ద మైనస్. ఒక అద్భుతమైన నటుడ్ని కేవలం స్క్రీన్ ప్రెజన్స్ కోసం వాడుకోవడం అనేది పెద్ద నేరం.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు బుచ్చిబాబు ఒక సగటు ప్రేమ కథను తీసుకున్నాడు సరే.. కథనం కూడా సాధారణంగానే ఉంది. అదీ సరే అనుకుంటే, చాలా సెన్సిబుల్ పాయింట్ అయిన క్లైమాక్స్ ను సింపుల్ గా ఎండ్ చేసేయడం, కరడుగట్టిన తండ్రి ఉన్నట్లుండి సున్నిత మనస్కుడిగా ఎందుకు మారిపోయాడు? అనేది జస్టిఫై చేయలేదు. ఇక మగతనం అనేది మనిషిలో ఉంటుంది కానీ.. శరీరంలో ఒక చోట కాదు అనే పాయింట్ ను ఎస్టాబ్లిష్ చేయడానికి కాలేజ్ సీన్ నుంచి ప్రయత్నిస్తూనే వచ్చాడు కానీ.. చివర్లో అర్ధాంతరంగా ముగించేయడం, దేవుడి బొమ్మతో కంపర్ చేయడం లాంటివి ఆడియన్స్ పాయింటాఫ్ వ్యూను జస్టిఫై చేయలేకపోయాయి. దేవి ఇచ్చిన అద్భుతమైన పాటల ప్లేస్ మెంట్ కానీ, సదరు పాటల చిత్రీకరణ కానీ పాటల స్థాయిలో లేదు. ఓవరాల్ గా దర్శకుడు బుచ్చిబాబు దర్శకుడిగా బొటాబొటి మార్కులతో నెట్టుకొచ్చాడు.

దేవిశ్రీప్రసాద్ చాన్నాళ్ల తర్వాత సరికొత్త బాణీలతో ఆకట్టుకున్నాడు. నేపధ్య సంగీతం విషయంలో మాత్రం పెద్ద జాగ్రత్త తీసుకోలేదు. రిపీటెడ్ ట్యున్స్ ను లూప్ లో పెట్టేశాడు. కొన్ని సన్నివేశాలకు, నేపధ్య సంగీతంలోని ఎమోషన్ సరిగా సింక్ అవ్వలేదు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ డిజైన్ రిచ్ గా ఉంది, ఆర్ట్ వర్క్ బాగుంది. ఎడిటింగ్ వర్క్ కూడా బాగుంది.

విశ్లేషణ: మెగా హీరో సినిమా అంటే ఉండే అంచనాలు వేరు. ఇప్పటివరకు మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రతి హీరో మాస్ సినిమాతోనే కెరీర్ మొదలెట్టాడు. అల్లు శిరీష్ ఒక్కడే “గౌరవం”తో కాస్త డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు. శిరీష్ లాగే వైష్ణవ్ కూడా కాస్త కొత్తగా ప్రయత్నించాడు. ఫస్టాఫ్ వరకు మెగా ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక మెగా హీరో నుంచి ఫ్యాన్స్ కోరుకునే అంశాలు ఫస్టాఫ్ లో పుష్కలంగా ఉన్నాయి. అయితే.. సెకండాఫ్ కి వచ్చేసరికి కథా గమనం గతి తప్పింది. జస్టిఫికేషన్ కు కనెక్ట్ అయితే బాగుంది అనిపిస్తుంది, లేదంటే మాత్రం కాస్త ఇబ్బందిపడాలి.

రేటింగ్: 2.5/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus