Utsavam Review in Telugu: ఉత్సవం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • దిలీప్ ప్రకాష్ (Hero)
  • రెజీనా కసాండ్ర (Heroine)
  • ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, నాజర్, రాజేంద్రప్రసాద్ (Cast)
  • అర్జున్ సాయి (Director)
  • సురేష్ పాటిల్ (Producer)
  • అనూప్ రూబెన్స్ (Music)
  • రాసుల్ ఎల్లోర్ (Cinematography)
  • Release Date : సెప్టెంబర్ 13, 2024

మోడ్రన్ సినిమా ఫార్మాట్ ను అడాప్ట్ చేసుకున్న తర్వాత ప్యాడింగ్ ఆర్టిస్టులతో సినిమాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇక మరుగునపడ్డ నాటక రంగం గురించి మొన్నామధ్య వచ్చిన “రంగమార్తాండ” తప్ప ఈమధ్యకాలంలో కనీసం ప్రస్తావించిన తెలుగు సినిమా కూడా లేదు. ఈ రెండిటి కలయికలో రూపొందిన చిత్రమే “ఉత్సవం” (Utsavam). కంటికి ఇంపుగా తెర నిండుగా సీనియర్ ఆర్టిస్టులతో అర్జున్ సాయి తెరకెక్కించిన ఈ చిత్రం గత కొంత కాలంగా విడుదలకు నోచుకోలేక ఇబ్బందులుపడుతూ.. ఎట్టకేలకు ఇవాళ (సెప్టెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ “ఉత్సవం” ఎలా జరిగిందో చూద్దాం..!!

Utsavam Review

కథ: సురభి నాటక మండలిలో కీలక సభ్యులైన అభిమన్యు నారాయణ (ప్రకాష్ రాజ్) కొడుకు కృష్ణ అభిమన్యు (దిలీప్ ప్రకాష్). అంతరించిపోతున్న నాటక రంగాన్ని, ఆ నాటకాన్ని నమ్ముకుని అసువులు బారుతున్న కళాకారుల కష్టాలను గట్టెక్కించాలనే దృఢ నిశ్చయంతో విశ్వప్రయత్నం చేస్తుంటాడు. అదే సమయంలో మరో రంగస్థల మహా నటుడు మహదేవ్ నాయుడు (నాజర్) కుమార్తె అయిన రమ (రెజీనా కసాండ్ర) సహాయంతో కార్పొరేట్ వీకెండ్ ఈవెంట్స్ లో నాటకాలను ప్రదర్శించే ప్రక్రియను విజయవంతంగా ప్రవేశ పెడతాడు.

ఈ క్రమంలో కృష్ణ-రమకు మధ్య ప్రేమ చిగురించి కొన్ని మనస్పర్థల కారణంగా పెళ్లి దాకా వెళ్లలేకపోతుంది. వారి ప్రయాణానికి “దక్ష యజ్ఞం” అనే నాటకం ఎలా కేంద్రబిందువుగా నిలిచింది? ఈ రంగస్థల సమూహం నడుమ యువ జంట తమ ప్రేమను తిరిగి పొందగలిగారా? అనేది “ఉత్సవం” సినిమా కథాంశం.

నటీనటుల పనితీరు: కన్నడ నటుడైన దిలీప్ ప్రకాష్ కి ఇది రెండో సినిమా. కెమెరా అంటే ఎక్కడా ఇబ్బందిపడలేదు, ఎమోషన్స్ ను కూడా చక్కగా పండించాడు. ముఖ్యంగా హావభావాల ప్రకటనలో చక్కని పరిణితి ప్రదర్శించాడు. హీరోయిన్ రెజీనా అందంగా కనిపించడమే కాక నటనతోనూ పర్వాలేదనిపించుకుంది.

వీళ్లిద్దరి కంటే.. బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్రప్రసాద్, అలీ, ఎల్.బి.శ్రీరామ్, ప్రేమ వంటి కళాకారులు గుక్కతిప్పుకోకుండా స్వచ్ఛమైన గ్రాంధిక తెలుగు భాషలో స్పష్టంగా పద్యాలు చదువుతూ డైలాగులు చెబుతుంటే ఎంత శ్రవాణానందంగా ఉందో. వీళ్లందరిలో ఉన్న అత్యుద్భుతమైన నటులను మన ఇండస్ట్రీ “టైప్ క్యాస్టింగ్” (ఒకే రకమైన పాత్రలు చేయించడం) చేస్తూ వారి టాలెంట్ ను గుర్తించడం లేదు అనిపిస్తుంటుంది. కనీసం ఇప్పటికైనా గుర్తించి వాళ్లను సరైన పాత్రల్లో వినియోగించుకోగలిగితే మలయాళ, మరాఠీ, బెంగాలీ ఇండస్ట్రీల రేంజ్ లో మనం కూడా అమోఘమైన నట విశ్వరూపాలను సిసలైన తెలుగు భాషలో చూడగలుగుతాం.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అర్జున్ సాయి ఒక నావెల్ పాయింట్ ను కథాంశంగా ఎంచుకున్నందుకు మెచ్చుకోవాలి. అయితే.. ఆ పాయింట్ ను సరిగా తెరకెక్కించడంలో మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా స్క్రీన్ ప్లే అతుకుల బొంతలా ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి సంబంధం లేకుండా సన్నివేశాలు వస్తుంటాయి. ఇక కొన్ని సన్నివేశాల్లో పట్టు ఉన్నప్పటికీ.. సదరు సన్నివేశాన్ని కంపోజ్ చేసిన విధానం బాగోక ఆకట్టుకోలేకపోయాయి. రచయితగా మంచి ఆలోచనలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. ఆ ఆలోచనలను చిత్రరూపంగా మలిచే దర్శకత్వ ప్రతిభలో మాత్రం అర్జున్ సాయి పరిపక్వత చెందాల్సిన అవసరం చాలా ఉంది. నిక్కచ్చిగా చెప్పాలంటే.. ఒక దర్శకుడిగా దారుణంగా విఫలమయ్యాడు.

రాసుల్ ఎల్లోర్ మార్క్ సినిమాటోగ్రఫీ వర్క్ ఒక్క “దక్ష యజ్ఞం” ఎపిసోడ్ లో తప్ప ఎక్కడా కనిపించలేదు. అనూప్ రూబెన్స్ పాటలు కూడా సోసోగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ కూడా చాలా పేలవంగా ఉన్నాయి.

విశ్లేషణ: కళాకారుల కష్టాలను కళాత్మకంగా చూపించగలగడం కూడా ఒక కళ. నాటక రంగం అంటేనే సహజత్వానికి ప్రతీక.. అటువంటి కళారంగం నేపథ్యంలో కృత్రిమమైన సంభాషణలు, మనసు లేని ప్రేమకథలు, హృద్యమైన భావం కొరవడిన బంధాలతో తెరకెక్కిన “ఉత్సవం” అనే చిత్రం ప్రేక్షకుల్ని అలరించడం అనేది అనితరసాధ్యం. అంతటి భారీ క్యాస్టింగ్, మంచి సెన్సిబిలిటీ ఉన్న మూలకథను దర్శకుడు అర్జున్ సాయి బూడిదలో పోసిన పన్నీరులా వృథా చేశాడు.

ఫోకస్ పాయింట్: అయోమయోత్సవం!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus