“వానర” అనే టైటిల్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టినప్పటికీ.. సెన్సార్ ఇష్యూ కారణంగా ఆఖరి నిమిషంలో “వనవీర”గా టైటిల్ మార్చుకోవాల్సి వచ్చినప్పటికీ.. వీలైంతవరకు ఆడియన్స్ కు చేరువయ్యేలా సిన్సియర్ ఎఫర్ట్స్ పెట్టారు దర్శకనిర్మాతలు. అవినాష్ స్వీయదర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం 2026 నూతన సంవత్సరం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ & ట్రైలర్ అయితే ఓ మోస్తరు ఆసక్తిని రేకెత్తించాయి. మరి సినిమా ఏమేరకు ఆకట్టుకోగలిగింది? అనేది చూద్దాం..!!
కథ: అయోధ్యపురం నియోజకవర్గంలో ఎన్నికల సంగ్రామం మొదలవుతుంది. అగ్రకులస్థుడు, స్థానబలం మెండుగా ఉన్న దేవా (శ్రీ నందు)కి ఎం.ఎల్.ఏ టికెట్ ఇచ్చి బరిలోకి దింపుతుంది అధిష్టానం.
ఆ క్రమంలో తన బలం నిరూపించుకునేందుకు బైక్ ర్యాలీ నిర్వహిస్తాడు దేవా. ఆ బైక్ ర్యాలీ కోసం రఘు (అవినాష్ తిరువీధుల) కొత్త బండిని కూడా తీసుకెళ్తారు.
తన బండిని వెనక్కి ఇవ్వమంటే మాత్రం రోజు రేపే అని మాట దాటవేస్తుంటారు.
రఘు తన బైక్ సాధించుకోగలిగాడా? అందుకోసం దేవాతో తలపడి నిలబడగలిగాడా? నిజంగా ఈ యుద్ధం మొత్తం బైక్ గురించేనా? వంటి ప్రశ్నలకి సమాధానమే “వనవీర” చిత్రం.
నటీనటుల పనితీరు: అవినాష్ కొత్త హీరో అనే భావన పెద్దగా కలగలేదు. డైలాగ్ డెలివరీ, ఎక్స్ ప్రెషన్స్ విషయంలో మంచి పరిణితి ప్రదర్శించాడు. ముఖ్యంగా మార్చ్యురీ సీన్ లో మంచి ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. యాక్షన్ బ్లాక్ విషయంలో ఇంకాస్త హోమ్ వర్క్ అవసరం. కెమెరా బట్టి మూమెంట్ ఇవ్వడం నేర్చుకోవాలి.
సిమ్రాన్ చౌదరి సొంత డబ్బింగ్ చెప్పుకోవడం వల్ల క్యారెక్టర్లో నేటివిటీ మిస్ అయ్యింది కానీ.. నటిగా మాత్రం మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది.
చాలా సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ గా మిగిలిపోయే టార్జాన్ కి ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ దొరికింది. ఆ పాత్రను అతను చక్కగా ఓన్ చేసుకుని నటించాడు కూడా.
శ్రీ నందు స్క్రీన్ ప్రెజన్స్ తో అందర్నీ డామినేట్ చేశాడు. అధికారం తాలూకు అహంకారం, కులం తాలుకు డామినేషన్ వంటివి అతడి కళ్ళల్లో, హావభావాల్లో, బాడీ లాంగ్వేజ్ లో స్పష్టంగా కనిపిస్తాయి. అయితే.. మంచి ఆర్క్ అనేది లేకపోవడంతో అది ఎఫెక్టివ్ గా లేదు.
శ్రీ హర్ష పాత్ర కూడా బాగుంది. అతని స్క్రీన్ ప్రెజన్స్ లో విలనిజం & కామెడీ రెండూ పండాయి.
శివాజీ, దేవీప్రసాద్, ఆమని తదితరులు తమ సీనియారిటీ ప్రూవ్ చేసుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాలో కాస్త ఇబ్బందిపెట్టిన విషయం AI. అవసరమైన దానికంటే ఎక్కువగా వాడేశారు. అవి కూడా ఒక్కోసారి ఒక్కో టోన్ లో ఉంటాయి. అందువల్ల.. ఆ ఫార్మాట్ స్క్రీన్ ప్లేకి పెద్దగా హెల్ప్ కూడా అవ్వలేదు.
సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ డీసెంట్ గా ఉన్నాయి. వివేక్ సాగర్ బీజీయం కొత్తగా ఉంది.
దర్శకుడు కమ్ కథానాయకుడు అవినాష్ తిరువీధుల ఎంచుకున్న పాయింట్ లో కొత్తదనం ఉంది. అయితే.. ఆ పాయింట్ ను నడిపిన స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం క్లారిటీ లోపించింది. బైక్ కోసం మొదలైన కథ కులాహంకారం వైపు మరలి, అనంతరం రివెంజ్ డ్రామా అవుతుంది. అందువల్ల.. ఏ ఎమోషన్ కి కనెక్ట్ అవ్వాలి, ఏ క్యారెక్టర్ తాలూకు పెయిన్ తో ట్రావెల్ చేయాలి అనే విషయంలో క్లారిటీ లోపించింది. అలాగే.. ఫాదర్ డెత్ రివీల్ సీక్వెన్స్ ను డీల్ చేసిన విధానంలో ఏమాత్రం ఎమోషన్ పండలేదు. అయితే.. కామెడీ విషయంలో మాత్రం మంచి కేర్ తీసుకున్నాడు. ముఖ్యంగా సత్యతో క్లైమాక్స్ లో వచ్చే పోలీస్ ట్రాక్ బాగా వర్కవుట్ అయ్యింది.
ముఖ్యంగా సింగం డైలాగ్ కి లిప్ సింక్ లేకపోవడం అనే డిటెయిలింగ్ బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్. అయితే.. ఈ సినిమాని ఇంకా బాగా తీయడానికి స్కోప్ ఉంది. పొలిటికల్ డ్రామాని, ఫాదర్ ఎమోషన్ ని పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. ఇంచుమించుగా ఇదే ఫార్మాట్ లో వచ్చిన “ఆంజనేయులు”లో ఫాదర్ ఎమోషన్ ను హ్యాండిల్ చేసిన విధానంలో ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఇంపాక్ట్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. ఓవరాల్ గా.. కథానాయకుడిగా మంచి మార్కులు సంపాదించుకున్న అవినాష్, దర్శకుడిగా మాత్రం బొటాబొటి మార్కులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
విశ్లేషణ: “వనవీర” అనే సినిమా కథనాన్ని రామాయణం నుండి ఇన్స్పైర్ అయ్యి నడిపించాలానే ఆలోచన బాగున్నప్పటికీ.. AI వాడకం దాన్ని పాడు చేసింది. అయినా.. ఒక పురాణం తాలుకు టచ్ అనేది అంతర్లీనంగా ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఉండాలి కానీ.. పదే పదే గుర్తు చేయడం మరీ నాటకీయంగా ఉంటుంది. ఇక ఈ సినిమా క్లైమాక్స్ ఫార్మాట్ మనకి అల్లరి నరేష్ సినిమాలు గుర్తుచేస్తాయి. ఓవరాల్ గా ఒక మంచి ప్రయత్నం అని మాత్రం చెప్పొచ్చు.
ఫోకస్ పాయింట్: రెగ్యులర్ సినిమాయే కానీ.. కొత్త ప్రయత్నం!
రేటింగ్: 2.5/5