వరుసగా రెండు సినిమాలకు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు వరుణ్ తేజ్. ఇందులో కొత్త విషయమేమీ కాలేదు. అయితే ఆ రెండు సినిమాల తర్వాత వరుణ్‌తేజ్ చేయబోయే సినిమాల లైనప్ మాత్రం సాలిడ్‌గా ఉంది. అదే ఈ రోజు విషయం. ‘భీమ్లా నాయక్’ విడుదలైన తర్వాత అందరూ సాగర్ కె.చంద్ర – వరుణ్‌తేజ్ సినిమా గురించే మాట్లాడుతున్నారు. అయితే అదొక్కటే కాదు… ఇంకా కొన్ని సినిమాలకు వరుణ్‌తేజ్ రెడీ అయ్యాడట. అన్నీ అనుకున్నట్లుగా జరిగి ఉంటే…
ఈ పాటికి వరుణ్‌తేజ్ ‘గని’ సినిమా విడుదలైపోయేది. వివిధ కారణాల వల్ల ఆ సినిమా ఆలస్యమవుతూ వస్తోంది. ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేస్తామని చెప్పినా… అనుకున్నట్లుగా అవ్వలేదు. ‘భీమ్లా నాయక్’ రిలీజ్ అవుతుండటంతో వాయిదా వేశారు. దీంతో మార్చి 4న డేట్‌గా ప్రకటించారు. అయితే ఆ డేట్ కూడా కాకుండా వేరే డేట్ అంటూ తాజాగా ఏప్రిల్ 8ని తేల్చారు. మరోవైపు ‘ఎఫ్ 3’ని మే 27న తీసుకొస్తున్నారు.
ఈ రెండు సినిమాల తర్వాత వరుణ్‌తేజ్ ఏ సినిమా చేస్తాడు అనే విషయంలో చిన్నపాటి క్లారిటీ వచ్చినట్లు అనిపిస్తోంది. అయితే నెక్స్ట్ ఏంటి అనేది తెలియదు కానీ… నెక్స్ట్ లైన్‌లో ఉన్న దర్శకులు ఎవరు అనేది మాత్రం చూచాయగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో వరుణ్‌తేజ్ చాలా కథలు విన్నాడట. అలా కథలు చెప్పినవారిలో ప్రవీణ్ సత్తారు, త్రినాథరావు నక్కిన లాంటివాళ్లు ఉన్నారట. వీరికి సాగర్ కె చంద్ర అదనం. వీరి ముగ్గురిలో ఒకరి సినిమా తొలుత మొదలవుతుందని సమాచారం.
పై ముగ్గురిలో ప్రస్తుతం ఖాళీగా ఉన్నది సాగర్ కె. చంద్రనే. ‘భీమ్లా నాయక్’ తర్వాత సాగర్ ఇంకే సినిమా ఓకే చేయించుకోలేదు. మరోవైపు ప్రవీణ్ సత్తారు నాగార్జున ‘ది ఘోస్ట్’ పనిలో బిజీగా ఉన్నారు. త్రినాథరావు నక్కిన అయితే రవితేజ ‘ధమాకా’ పనులు చివరి దశకు తీసుకొచ్చాడు. మరి మనం అనుకున్నట్లుగా ఈ సినిమాలు లైన్‌లోకి వస్తాయా? లేదంటే వేరే ఇంకేదైనా సినిమా వస్తుందా అనేది చూడాలి. ఏదైనా లైనప్ అయితే సాలిడ్‌గా ఉంది.