సినిమా రంగంలో శుక్రవారం నిర్మాతలకే కాదు నటీనటులకు, సాంకేతిక నిపుణులకూ కీలకమే. ఆరోజు చీకటి గదిలో వెండితెరపై వచ్చే వెలుగు ఫలితాన్ని బట్టే వారి కెరీర్ లో తర్వాతి రోజు ఉదయమా, అస్తమయమా అన్నది తెలుస్తుంది. స్టార్ వారసులకు, వారి వెన్నుదన్నందించిన వారి విషయంలో దీనికి కొంత మినహాయింపు ఉందనుకోండి. అయితే హిట్ పెద్దవారికి తర్వాతి అవకాశం గగనమే అయ్యే సందర్భాలు కూడా లేకపోలేదు. దానికి దర్శకుడు వీరు పోట్ల ఓ ఉదాహరణ.
ప్రభాస్ కెరీర్ లో తొలి విజయం ‘వర్షం’, సిద్ధార్థ్ కి ఘన విజయం అందించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాలకు రచన విభాగంలో కీలక పాత్ర పోషించిన వీరూ పోట్ల ‘బిందాస్’ సినిమాతో దర్శకుడిగా మారాడు. తొలి ప్రయత్నంలో విజయం అందుకున్న వీరూ తర్వాత నాగ్ తో ‘రగడ’ చేశారు. తర్వాత విష్ణుతో చేసిన ‘దూసుకెళ్తా’ కూడా హిట్ గా నిలిచింది. ఇలా రచయితగా, దర్శకుడిగా విజయం సాధించిన వీరూకి తర్వాతి అవకాశాలు వచ్చినట్టే వచ్చి హీరోలు జంప్ అవడంతో చేజారిపోయాయట. కారణమేమిటన్నది తెలియనప్పటికీ వెంకటేశ్, రవితేజలతో చేయాల్సిన మల్టీ స్టారర్ సినిమా కూడా నీరుగారిపోయింది.
దాంతో మూడేళ్ళ తర్వాత సునీల్ హీరోగా ‘ఈడు గోల్డ్ ఎహె’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన వీరు పోట్ల ఈ గ్యాప్ కి గల కారణాలను వివరిస్తూ ”సినిమాల్లో ఇంతేనేమో” అన్నారు. సునీల్, వీరు పరిశ్రమలో అడుగుపెట్టిన నాటినుండి మంచి స్నేహితులుగా మెలుగుతూ వస్తున్నారు. ఈ సినిమా విజయం ఇద్దరికీ కీలకంగా మారిన పరిస్థితుల్లో ఫలితం ఏమిటన్నది నేడు తేలనుంది.