త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది ఆయన మార్క్ రైటింగ్. సాధారణ మాటల్లోనే లోతైన భావాలు చెప్పడం, ఎమోషన్‌కు కామెడీని కలిపి డైలాగ్స్‌ను వాడుక భాషలోకి తీసుకురావడం ఆయన ప్రత్యేకత. అయితే రచయితగా త్రివిక్రమ్‌కు అసలైన గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా నువ్వు నాకు నచ్చావ్. వెంకటేష్ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషన్‌గా నిలిచింది. డైలాగ్స్ నుంచి సన్నివేశాల వరకు ప్రతీది ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా ముద్ర వేసింది. వెంకటేష్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆ జోష్‌తోనే త్రివిక్రమ్ దర్శకుడిగా మారి చేసిన తొలి చిత్రం నువ్వే నువ్వే. ఈ సినిమాతో ఆయన డైరెక్టర్‌గా కూడా తన సత్తా చాటారు. అక్కడి నుంచి అతడు, జల్సా, అత్తారింటికి దారేది, అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్‌బస్టర్లతో త్రివిక్రమ్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఇంత గొప్ప ఆరంభం తర్వాత కూడా త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబో మళ్లీ ఎందుకు రాలేదన్న ప్రశ్న ఫ్యాన్స్‌లో చాలా కాలంగా ఉంది.

ఈ విషయంపై ఇటీవల వెటరన్ ప్రొడ్యూసర్ స్రవంతి రవి కిషోర్ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఒక దశలో వెంకీతో మరో సినిమా చేయాలని అనుకున్నప్పుడు, త్రివిక్రమ్ ఓ కథ చెప్పారట. ఆ కథ వెంకటేష్‌కు బాగా సూట్ అవుతుందనిపించినా, అదే సమయంలో ఆయన ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ మూవీ షూటింగ్‌లో ఉండటంతో రెండు కథలు కొంత దగ్గర పోలికగా అనిపించటంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పారు. అలా ఆ క్రేజీ కాంబో అప్పట్లో మిస్ అయింది.
ఇప్పుడు ఆ గ్యాప్ తీరేలా ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. పూర్తిగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ హిలేరియస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2026 సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశముందని టాక్. మరోవైపు త్రివిక్రమ్ వద్ద అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో భారీ ప్రాజెక్ట్స్ ప్లానింగ్‌లో ఉండగా, వెంకటేష్ త్వరలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. మొత్తానికి గురూజీ – వెంకీ కాంబో రీఎంట్రీ వార్తలతో ఫ్యాన్స్‌లో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
