గోల్డెన్ లెగ్ గా మారిపోయిన వెంకటేష్..?

  • April 20, 2019 / 01:12 PM IST

‘విక్టరీ వెంకటేష్ ఓ ఆవకాయ పచ్చడి లాంటి వారు. ఆయన్ని ఇష్టపడని తెలుగు ప్రేక్షకుడు ఉండడు’… ఇవి ‘జెర్సీ’ ఆడియో వేడుకలో నాని చెప్పిన మాటలు. నాని నిజమే చెప్పాడు. వెంకటేష్ ను ఇష్టపడని ప్రేక్షకులే ఉండరు. ఇక వెంకటేష్ గోల్డెన్ లెగ్ అని కూడా అంటున్నారు మన ప్రేక్షకులు. ఐపిఎల్ మ్యాచ్ లకి ముఖ్యంగా సన్ రైజర్స ఆడుతున్న మ్యాచ్ లకి వెంకటేష్ అడుగెడితే ఆ మ్యాచ్ కచ్చితంగా మన ‘సన్ రైజర్స్’ టీం గెలుస్తుందనే ఓ గట్టి నమ్మకం జనాల్లో ఉంది. అంతే కాదు మన ఇండియన్ టీం ఆడే మ్యాచ్ లకి కూడా వెంకీ వస్తే దాదాపు గెలిచినట్టే అని అందరూ ఫిక్సయిపోయారు. ఇప్పుడు ఇతర హీరోల సినిమాల వేడుకలకి కూడా వెంకీ అడుగెడితే బ్లాక్ బస్టరే అనే సెంటిమెంట్ మొదలైపోయింది.

ముఖ్యంగా ప్లాపుల్లో ఉన్న హీరోల… కొత్త సినిమా వేడుకలకి వెంకటేష్ అడుగుపెడితే బ్లాక్ బస్టరేనంట. మహేష్ బాబు ‘1 నేనొక్కడినే’ ‘ఆగడు’ వరుస డిజాస్టర్లతో డీలా పడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. తరువాత వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమా ఆడియో వేడుకకి వెంకీ ముఖ్య అతిధిగా వచ్చాడు. ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. నిజానికి ‘శ్రీమంతుడు’ అంత పెద్ద విజయం సాదిస్తుందని నేను కూడా ఊహించలేనని మహేష్ కూడా చెప్పాడు. ఈ సినిమా అప్పుడు ‘నాన్ బాహుబలి’ రికార్డును సొంతం చేసుకుంది. ఇక తన మేనల్లుడు నాగచైతన్య ‘మజిలీ’ ప్రీ రిలీజ్ వేడుకకి కూడా వెంకటేష్ వచ్చాడు. చైతన్య కూడా వరుస ప్లాపుల్లో ఉన్న సంగతి తెలిసిందే. ‘మజిలీ’ కి మంచి టాక్ వచ్చింది కానీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే కాదు. కానీ ఈ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. చైతన్య కెరీర్లోనే ఇది పెద్ద హిట్ అని చెప్పొచ్చు. ఇక తాజాగా నాని.. ‘జెర్సీ’ ప్రీ రిలీజ్ వేడుకకి కూడా వెంకీ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. నాని కూడా రెండు ప్లాపులతో సతమవుతున్నాడు. ఏప్రిల్ 19 (నిన్న) విడుదలైన ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. నాని కెరీర్లోనే ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలిచిపోతుందని చెబుతున్నారు. ఏదేమైనా ప్లాపుల్లో ఉన్న హీరోల సినిమా వేడుకలకి వెంకీ అడుగెడితే బ్లాక్ బస్టరే అంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏమైనా సినిమాలో కంటెంట్ ఉంటే హిట్టవుతుంది కానీ ఇలాంటి సెంటిమెంట్లు కుదిరితే హిట్టయిపోతాయా ఏంటి. కానీ ఇండస్ట్రీలో రకరకాల సెంటిమెంట్లు నడుస్తుంటాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus