Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?
- August 12, 2026 / 05:06 PM ISTByFilmy Focus Desk
అభిమానం అంటే ఎలా ఉంటుంది అని చెప్పలేం.. ఎందుకంటే దానికో రూపం ఉండదు. కానీ అభిమానం ఎలా చూపించాలి అంటే మాత్రం చాలా ఆప్షన్లు కనిపిస్తాయి. అలాగే గౌరవం కూడా అంతే. ఇప్పుడు ఈ రెండూ కలిపి చూపించే ఓ కొత్త విధానాన్ని యువ దర్శకుడు వెంకీ అట్లూరి చేసి చూపించారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ దీనికి వేదిక అయింది. సూర్య హీరోగా రూపొందిన ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కించిన విషయం తెలిసిందే.
Venky Atluri – Suriya
ప్రీరిలీజ్ ఈవెంట్‌లో సూర్య మాట్లాడబోతుండగా.. వెంకీ అట్లూరి పక్కకు వచ్చి నిలబడ్డారు. ఆ తర్వాత ఆ పైన చూడండి ఎవరో ఉన్నారో, ఏదో ఉందో అన్నట్లుగా సూర్యకు చూపించారు వెంకీ అట్లూరి. ఆయన అలా పైకి తలెత్తి చూశారో లేదో.. ఠక్కున వెంకీ అట్లూరి సూర్య రెండు పాదాలను చేతిలో టచ్ చేసి నమస్కారం చేశారు. సూర్య తేరుకొని చూసేలోపే వెంకీ అల్లంత దూరం వెళ్లిపోయారు. వెంటనే సూర్య కొట్టబోతున్నట్లు చేయి ఎత్తి నవ్వేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సూర్య అంటే వెంకీ చాలా గౌరవం. కానీ ఇలా కాళ్లకు నమస్కారం చేయడాలు లాంటివి సూర్యకు నచ్చవు. అందుకే ఇలా తన గౌరవం, ప్రేమను చూపించాల్సి వచ్చింది అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమా గురించి సూర్య మాట్లాడుతూ ఈ సినిమాను మీరు థియేటర్లలో చూసి కచ్చితంగా ప్రేమిస్తారని నమ్ముతున్నాను. త్రివిక్రమ్ కుటుంబ విలువలతో కూడిన మంచి సినిమాలను, ఈ జనరేషన్ మెచ్చేలా అందించారు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు వెంకీ అని చెప్పారు.
అలాగే ఈ సినిమా కోసం హైదరాబాద్‌లో ఉన్న ఆరు నెలలు మరచిపోలేను. ఈ సినిమా నాకు ప్రత్యేకమైనది. 20 ఏళ్ల క్రితం ‘గజినీ’ సినిమాలో నన్ను సంజయ్ రామస్వామిగా ఆదరించారు. అదే మ్యాజిక్ తీసుకురావాలని వెంకీ, నాగవంశీ అనుకున్నారు. వెంకీని దర్శకుడి కంటే రచయితగా ఎక్కువ అభిమానిస్తాను. ఇంత గొప్పగా రాయడం మామూలు విషయం కాదు. వెంకీతో మళ్లీ కలిసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నాను అని సూర్య చెప్పారు.














