Vennela Kishore: వెన్నెల కిషోర్‌ సెకండ్‌ అటెంప్ట్‌… ఈసారి ఏం చేస్తాడో మరి!

కమెడియన్లు హీరోలు అవ్వడం, తిరిగి మళ్లీ కామెడీకి వచ్చేయడం టాలీవుడ్‌లో చూశాం. అయితే అలా వెళ్లినవాళ్లు మంచి హిట్‌ కొట్టి, హీరో అనిపించుకున్నాకే వెనక్కి వచ్చారు. ఈక్రమంలో ఇబ్బందులు ఎదుర్కొన్న హీరోలూ ఉన్నారు. అయితే ఒక కమెడియన్‌ మాత్రం హీరో అవ్వడానికి ప్రయత్నించి ఇబ్బందిపడి ఇన్నాళ్లూ మరో ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు చేస్తున్నారు. ఆ కమెడియనే వెన్నెల కిషోర్‌. ‘చారి 111’ (Chaari 111) అనే సినిమాతో వెన్నెల కిషోర్‌ (Vennela Kishore) ఈ ఏడాదే హీరో అయ్యాడు.

కామెడీ డిటెక్టివ్ చుట్టూ తిరిగే కథ ఆ సినిమా. ‘చంటబ్బాయి’ స్టయిల్లో ట్రై చేశారు కానీ థియేటర్లలో వర్కవుట్ కాలేదు. అయితే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌కి వచ్చినప్ఉడు మాత్రం బాగానే చూశారు. అత్యధిక వ్యూస్ అందుకున్న తెలుగు చిత్రాల్లో ఇదొకటి అని అమెజాన్‌ ప్రైమ్‌ చెబుతోంది. ఇక ఆ ఉత్సాహమో ఏమో కొత్త సినిమా అనౌన్స్‌ చేశాడు వెన్నెల కిషోర్‌. తొలి చిత్రం ‘చారి 111’ తరహాలోనే మళ్లీ కామెడీ డిటెక్టివ్ కథతోనే కిషోర్ హీరోగా రెండో సినిమా చేస్తుండటం గమనార్హం.

ఆ సినిమా పేరు.. ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. సినిమా మోషన్ పోస్టర్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. చిన్న పిట్టకథ రూపంలో సినిమాకు ఇంట్రో ఇచ్చారు. ‘కథలు వెతలాయె కథనాలు ఏడాయె.. మొన్న సచ్చిన కుందేలు నిన్న కూరాయె.. దాని చంపినోడు సచ్చి ఆరు నెల్లాయె.. ఈ చిక్కుముడి విప్పినోడు..” అంటూ సినిమా మోషన్‌ పోస్టర్‌ తీసుకొచ్చారు. ఆ చిక్కుముడి విప్పినోడు షెర్లాక్‌హోమ్స్‌.. అదేనండీ ‘శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్స్‌’ అని చెప్పేశారు.

ఇందులో వెన్నెల కిషోర్ గెటప్ ఫన్నీగా ఉంది. ఈ సినిమాలో కిషోర్‌ సరసన అనన్య నాగళ్ల (Ananya Nagalla) కథానాయికగా నటిస్తోంది. రైటర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వెన్నపూస రమణారెడ్డి నిర్మిస్తున్నారు. మోషనల్‌ పోస్టర్‌తో ఆసక్తి కలిగించిన ఈ చిత్రం థియేటర్‌ సినిమా అనిపించుకుంటుందా? లేక ఓటీటీ సినిమా అనిపించుకుంటుందా అనేది చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus