హిందీ సినిమా పరిశ్రమలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్ కుమార్ (Manoj Kumar) (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హరికృష్ణ గోస్వామి అలియాస్ మనోజ్ కుమార్ పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
1937లో జన్మించిన మనోజ్ కుమార్.. 1957లో ‘ఫ్యాషన్’ అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తొలుత ‘కాంచ్ కీ గుడియా’ అనే సినిమాలో నటనతో మంచి గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత దర్శకుడిగా, రచయితగా, నటుడిగా చాలా సినిమాలు చేశారు. 40 సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమకు సేవలు అందించారు. అగ్రహీరోలతోనే ఎక్కువగా సినిమాలు రూపొందించారు. అమితాబ్ బచ్చన్ హీరోగా 1974లో మనోజ్ తెరకెక్కించిన ‘రోటీ కపడా ఔర్ మకాన్’ (Roti Kapda Aur Makaan) బాలీవుడ చరిత్రలోనే అతి పెద్ద విజయం.
మనోజ్ సినిమా అంటే బ్లాక్‌బస్టర్ బొమ్మ అనే మాట ఆ రోజుల్లో బాలీవుడ్‌లో ఎక్కువగా వినిపించేది. అలాగే దేశభక్తి సినిమాలు తెరకెక్కించడంతో దిట్ట అని పేరు సంపాదించి ‘భరత్ కుమార్’గా అందరికీ గుర్తుండిపోయారు. ‘షహీద్’ (1965), ‘ఉపకార్’ (1967), ‘పురబ్ ఔర్ పశ్చిమ్’ (1970) వంటి అనేక దేశభక్తి చిత్రాలు ఆయన నుండి వచ్చాయి. వీటిని తెరకెక్కించడమే కాదు.. కొన్ని కీలక పాత్రల్లోనూ నటించారు కూడా.
చిత్ర పరిశ్రమకు మనోజ్ కుమార్ చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 1992లో పద్మశ్రీ పురస్కారం, 2015లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులతో సత్కరించింది. ‘హరియాలీ ఔర్ రాస్తా’, ‘వో కౌన్ థీ’, ‘హిమాలయ్ కి గాడ్ మే’, ‘దో బదన్’, ‘పత్తర్ కే సనమ్’, ‘నీల్ కమల్’, ‘క్రాంతి’ లాంటి గొప్ప సినిమాలు ఆయన ఫిల్మోగ్రఫీలో ఉన్నాయి. ఇక మనోజ్ మృతికి భారత ప్రధాని నరేంద్ర మోదీ తదితర ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.